ఫుడ్ ఫాస్టింగ్ గురించి విన్నాం.. ఈ స్కిన్ ఫాస్టింగ్ ఏంటి?
కొంత కాలం పాటు చర్మానికి ఎటువంటి సౌందర్యసాధనాలు వాడకుండా ఉండడమే ఈ స్కిన్ ఫాస్టింగ్. అసలు ఏంటీ స్కిన్ ఫాస్టింగ్ గొప్పతనం? ఈ పేరు అసలు ఎలా వచ్చింది? దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. జపాన్‌కు చెందిన మిరాయి క్లినిక్ అనే ఓ స్కిన్ కేర్ కంపెనీ ఈ స్కిన్ ఫాస్టింగ్‌ను వినూత్నంగా సృష్టించింది. సంప్రదాయ ఉపవాసాలతో శరీరానికి ఆరోగ్యపరమైన లాభం చేకూరుతుందనే హిపొక్రటీస్ నమ్మకం స్ఫూర్తితో స్కిన్ ఫాస్టింగ్ ప్రక్రియ జపాన్‌లో రూపు దిద్దుకున్నట్టు అర్థమవుతోంది.
సౌందర్య సాధనాలతో చర్మ రంధ్రాలు మూసుకుపోయి ఉంటే, సరిపడా గాలి అందక చర్మం పలు రకాల సమస్యలకు గురయ్యే వీలుంటుంది. కాబట్టి చర్మానికి ఎటువంటి క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు, మేకప్ అప్లై చేయకుండా వదిలేస్తే, చర్మంలో సహజసిద్ధ నూనెల ఉత్పత్తి జరిగి, తేమ అంది చర్మం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. చర్మానికి ధారళంగా గాలి అందుతూ ఉండాలి. ఒక నెలలో చర్మంలో జరిగే మార్పుల గురించి జపనీయులు అధ్యయనాలను నిర్వహించారు.
ఈ అధ్యయనాల్లో స్కిన్ ఫాస్టింగ్ వల్ల చర్మంలోని విషకారకాలు, మలినాలు తొలగి, చర్మం పునరుత్తేజం పొందడాన్ని వారు గమనించారు. అయితే అన్ని రకాల చర్మాలకూ ఈ స్కిన్ ఫాస్టింగ్ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. యాక్నె తలెత్తే తత్వం ఉన్న చర్మతత్వం కలిగినవాళ్లు, విపరీతమైన పొడిచర్మం కలిగినవాళ్లు, సున్నిత చర్మం కలిగినవాళ్లు స్కిన్ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండడమే మేలంటున్నారు చర్మ నిపుణులు.