స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

P.Phanindra
అమెరికాలోని చికాగోలో జీవిస్తున్న సీత శొంఠి అనే తెలుగు మహిళ తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పారు. కోనసీమలో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వారికి జన్మించిన ఆమె ఇప్పుడు ప్రపంచంలోనే ప్రఖ్యాత స్పేక్‌ఎక్స్ సంస్థలో మిషన్ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన తల్లిదండ్రులు డాక్టర్ లేదా ఇంజినీర్‌ను చేయాలనుకున్నప్పటికి ఆమెకు భిన్నంగా ఏదో సాధించాలనే కోరిక మొదటి నుంచి ఉండేది.

ఈ కారణంగానే ఆమె పొలిటికల్ ఎకనామిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. అనంతరం మిడిల్ ఈస్ట్ రాజకీయాలను అధ్యయనం చేశారు. అంతేకాకుండా ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్‌ వంటి దేశాలలోని అమెరికన్‌ ఎంబసీలలో సీత శొంఠి పని చేశారు. అమెరికా – ఇరాక్‌  యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్‌ కట్టి, వారి వివరాలను అమెరికాకు సీత శొంఠి తెలియచేశారు. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం.

22 ఏళ్ళకే ఇరాక్‌ యుద్ధ బంకర్లలో పని చేశారంటే ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సీత శొంఠి జీవితాన్ని ఒకసారి వెనక్కు తిరిగి చూస్తే.. మొత్తం ఎనిమిది దేశాల్లోని అమెరికన్‌ ఎంబసీల్లో కొలువు చేయడమే కాకుండా.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు, కర్ణాటక సంగీత కచేరీలు కూడా చేశారు. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. అమెరికాలోనే జన్మించినప్పటికి ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ఆమె ఎన్నడూ మర్చిపోలేదు.

ఆమె తల్లిదండ్రుల స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం. సీత శొంఠి తండ్రి 1975లో అమెరికాకు వలస వెళ్లారు. కాగా.. సీత శొంఠికి జయరామ్, ఆనంద అని ఇద్దరు పిల్లలు. ఒకపక్క వారి బాగోగులు చూసుకుంటూనే ఆమె తన వృత్తిలో దూసుకుపోతున్నారు. ఆమెతో పాటు ఆమె పిల్లలు కూడా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఆమె తన పిల్లలతో కలిసి దేవాలయానికి తప్పకుండా వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: