విజయం మీదే: ఎల్లప్పుడూ స్వయంకృషినే నమ్ముకోండి ...

VAMSI
సమాజంలో చాలా మంది తమకంటూ ఓ ఆశయం లేకుండా, వారికంటూ ఓ గుర్తింపు లేకుండా ఎవరి పంచనో చేరి వారి నీడలో జీవనం సాగిస్తుంటారు. కానీ అటువంటి వారు ఒకటే ఆలోచించాలి. ఇలాంటి జీవనం ఎంతవరకు సమంజసం అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేయడం వల్ల సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు లభించదు. గౌరవ మర్యాదలు కూడా అంతంతమాత్రంగానే అందుతాయి. అభివృద్ధి కూడా పెద్దగా కనిపించదు. అలాంటప్పుడు ఈ తరహా జీవనం సాగించడంలో అర్ధం లేదు. అందుకే ఒకరి నీడలో ఎదగాలి అనుకోవడం అసమర్థతే అవుతుంది. కష్టమైనా సరే సొంతంగా ఎదగడంలో ఎంతో గొప్పతనం దాగి ఉంటుంది. స్వయంకృషితో సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు.

ఏదైనా ప్రారంభంలో కష్టం అనిపించవచ్చు, కష్టాలు ఎదురైనప్పుడు కృంగి పోయేంత  బాధ కలగవచ్చు. కానీ అవన్నీ తట్టుకొని నిలబడగలిగినప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. స్వయంకృషితో వచ్చే విజయంలో ఉన్న ఆనందం మనశ్శాంతి మరెందులోనూ దొరకదు. అటువంటి వారికి అడక్కుండానే గౌరవం లభిస్తుంది. చెప్పకుండానే జనాలు అభిమానిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీకంటూ ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా కొందరు ఎలాగోలా జరిగిపోతుంది కదా అనుకొని ఎవరి నీడనో బ్రతికేస్తుంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే నీడలో మొక్కలే ఎదగలేవు. అలాంటిది మనుషులు ఎలా ఎదగగలరు.

చిన్న ప్రయత్నం అయినా పెద్ద ప్రయత్నం అయినా సొంతంగా చేసినప్పుడే దాని విలువ మీకు అర్థమవుతుంది. తద్వారా వచ్చే ఫలితం మీకు అందుతుంది. అందుకు తగ్గ గుర్తింపు మీకు లభిస్తుంది. కాబట్టి సొంత ఆలోచనలతో, కష్టపడి జీవించడం నేర్చుకోండి, జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోండి. అప్పుడే మీరు బ్రతుకుతున్న జీవితానికి ఒక అర్ధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన విషయాలను అర్ధం చేసుకుని అనుసరించండి విజయం మీదే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: