ప్రతి మనిషిలోనూ ఎంతో కొంత గర్వం ఉంటుంది అది సహజమే. కానీ ఆ గర్వం యొక్క మోతాదు మించినప్పుడే మనిషి కష్టాలలో పడతాడు, సమస్యల వలయంలో చిక్కుకుని ఇబ్బంది పడతాడు. కాబట్టి మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇది చాలా చిన్న పొరపాటే కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి బైక్ ను చాలా బాగా డ్రైవ్ చేయగలడు అనుకోండి. ఆ విషయం గురించి ఎవరైనా అడిగితే సింపుల్ గా నాకు బైక్ నడపడం వచ్చు అని అంటే సరిపోతుంది.
కానీ కొందరు గర్వానికి పోయి తామే గొప్ప అని నిరూపించుకోవడానికి, నేను బెస్ట్ రైడర్ ని, నాలా ఎవరూ బండి నడపలేరు అంటూ గొప్పలకు పోయి వారికి చూపించడం కోసం ఎక్స్పరిమెంట్స్ చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటారు. కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరగవచ్చు. మరికొందరు నేను చాలా రిచ్ అంటూ ఇతరుల ముందు విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. ఇలా చాలా మంది ఇతరుల ముందు గర్వం చూపించబోయి కష్టాలపాలవుతుంటారు. కాబట్టి ఎవరైనా ఎంతటి వారైనా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న విషయం గుర్తు ఉంచుకుని మెలగాలి.
అప్పుడే మన జీవితం బాగుంటుంది ఉన్నత స్థాయికి చేరుతాం లేదంటే. ఉన్నది కాస్త ఊరి పేరు లేకుండా పోతుంది. గర్వం ప్రదర్శిస్తే చివరికి కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం నిన్ను సమర్థించరు. పైగా మెల్లమెల్లగా అందరూ మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతారు. ఇన్ని అనర్థాలకు కారణమయ్యే గర్వాన్ని మొదటి దశలోనే నియంత్రించడం మంచిది, అప్పుడే మన జీవితం సాఫీగా సరదాగా సాగిపోతుంది. ఇదే కాదు మనకు కీడు చేసే ఏ గుణం లేదా స్వభావాన్ని అయినా మొదటి లోనే అణచి వేయడం అన్నిరకాలుగా శ్రేయస్కరం.