విజయం మీదే: జీవితంలో బంధాల విలువ తెలుసుకో...?
జీవితంలో మనుషుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు, ప్రేమలు, కోపాలు, గొడవలు అన్నీ సహజం. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఈ భావాలు బయటపడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనతో ఉన్న వారి విలువ మనకు తెలియక పోవచ్చు.... వాస్తవానికి మనం వాటి విలువను గుర్తించలేక పెద్దగా పట్టించుకోము. కానీ ఒక్కసారి ఆ బంధం దూరమైంది అంటే అప్పుడు ఆ బంధములో లేనప్పుడు అసలు విలువ తెలుస్తుంది. కానీ అప్పటికే అంతా జరిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు చాలామందికి వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలియదు.
వారు ఉన్నప్పుడు వారి ప్రేమ తమకు చిరాకు అనిపిస్తుంది.. వారు చూపించే ప్రేమ మనకు కష్టంగా అనిపించవచ్చు.మనల్ని క్రమశిక్షణలో పెట్టే క్రమంలో కాస్త కటువుగా ఉండడం మనకి బాధ కలిగించవచ్చు. అందుకే చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రులతో ప్రేమగా ఉండకపోగా... దూరంగా వుండడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కసారి ఉన్నట్టుండి వారు మనకు దూరం అయినప్పుడు... వారి విలువ తెలుస్తుంది. మనం ఏం కోల్పోయామో అర్థమవుతుంది.
వాళ్ళు మనతో ఉన్న సమయంలో వారితో ప్రేమగా ఉండి ఉంటే కనీసం వాళ్ళు సంతోషంగా ఉండే వాళ్ళు ఏమో అనిపిస్తుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి ఉంటుంది. కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలేము అనే సత్యాన్ని గ్రహించాలి. బంధాలు మనతో ఉన్నప్పుడే వాటి విలువను తెలుసుకొని ఆనందంగా ఉంటూ సంతోషాన్ని పంచాలి. దూరమయ్యాక అది చేసి ఉంటే బాగుండేది, ఇలా నడుచుకొని ఉంటే బాగుండేది అనుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు.