ఇంజనీరింగ్ లో లక్ష్యాన్ని మరిచారా అంతే...?

VAMSI
యువత అంతా ఇంజనీరింగ్‌లో సుస్థిర కెరీర్‌ను అందుకునే లక్ష్యంతో కాలేజీ క్యాంపస్‌లో అడుగుపెడుతున్నారు. ప్రతిష్టాత్మక ఐఐటీ అయినా, సాధారణ కళాశాల అయినా ఎందులో చేరినప్పటికీ నాలుగేళ్ల బీటెక్/బీఈ కోర్సులో మొదటి ఏడాది నుంచే మెరవాలి...అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. మాములుగా ఇంటర్‌లో చేరినప్పటి నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో ఇంజనీరింగ్ లక్ష్యంగా విద్యార్థులు చదువుతుంటారు. రెండేళ్ల పాటు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియదనే విధంగా కష్టపడిన విద్యార్థులు, ఇంజనీరింగ్‌లో చేరగానే ఒక్కసారిగా స్వేచ్ఛా ప్రపంచంలో అడుగుపెట్టినట్లు భావిస్తారు. ఈ స్వేచ్ఛకు పరిమితులు విధించుకోవాలి. లక్ష్యాన్ని మరవకుండా, దాన్ని సాధించడంపైనే దృష్టినిలపాలి.
విద్యార్థులు ఈ స్వేచ్ఛ వాతావరణం నుండి వీలైనంత తొందరగా బయటపడాలి. బ్రాంచ్ ఏదైనప్పటికీ మొదటి ఏడాదిలో ఒకట్రెండు తప్ప అన్ని సబ్జెక్టులూ ఉమ్మడిగా ఉంటాయి. వీటిని వచ్చే మూడేళ్ల కోర్సుకు పునాదులుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు ఏ బ్రాంచ్‌కు సంబంధించిన వారైనా రాణించాలంటే ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్ బేసిక్స్‌పై పట్టుండాల్సిందే. అందువల్ల మొదటి సంవత్సరంలోని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ఉన్నత శ్రేణి కళాశాలలు మెంటారింగ్ సెల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిలో సీనియర్లు, లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. తరగతిగదిలో సందేహాలు నివృత్తి చేసుకోలేని వారు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలను నివృత్తిచేసుకోవచ్చు. మెంటార్లలో ఎక్కువ మంది సీనియర్లు ఉండటం వల్ల విద్యార్థుల్లో త్వరగా బిడియం పోతుంది.
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న కరిక్యులంను పరిగణనలోకి తీసుకుంటే, లెక్చరర్ లేదా ప్రొఫెసర్ బోధించే అంశాలకు అదనంగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి స్వీయ అభ్యసన ద్వారా వివిధ అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం సంస్థలో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. భవిష్యత్తులో ఉద్యోగాలు చేజిక్కించుకోవడంలో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కీలకపాత్ర పోషిస్తాయి. విద్యార్థి దశలో వీటిని పెంపొందించుకునేందుకు గ్రూప్ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కళాశాలల్లో నిర్వహించే సెమినార్లు, బృంద చర్చల్లో పాల్గొనడం వల్ల ఎన్నో నైపుణ్యాలు అలవడతాయి. బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం లభిస్తాయి. కాబట్టి ఇంజనీరింగ్లో మొదటి నుండి ఒక ప్రణాళిక ప్రకారం సాధన చేసుకుంటూపోతే మీరు సులభంగా ఇంజినీరింగును పూర్తి చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: