విజయం మీదే : ఒత్తిడిని జయిస్తే పరీక్షల్లో విజయం మీ సొంతం
చాలా మంది విద్యార్థులు పరీక్షలకు బాగానే ప్రిపేర్ అయినప్పటికీ పరీక్షల సమయంలో ఒత్తిడి వలన ప్రశ్నలకు సమాధానాలు రాయలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒత్తిడి వలన పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని జాగ్రత్తలను తీసుకుంటే ఒత్తిడిని జయించి పరీక్షలలో మంచి మార్కులు సాధించవచ్చు. చాలామంది విద్యార్థులు తాము చదవలేదేమో లేక చదివినవి పరీక్షలో గుర్తుకు రాకపోతే నా పరిస్థితి ఏమిటి..? అని అనవసర సందేహాలతో భయపడుతూ ఉంటారు.
పరీక్షల సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఒత్తిడి నుండి బయటపడవచ్చు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి. మార్కుల కోసం కాకుండా సబ్జెక్ట్ మీద పట్టు కోసం ప్రిపేర్ కావాలి. పరీక్షల సమయంలో ఏవైనా సందేహాలు వస్తే వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకొని ఆ పాయింట్లను తెలిసిన విషయాలతో లింక్ చేసుకోవాలి.
ప్రిపరేషన్ పూర్తయిన తరువాత మోడల్ పేపర్లకు నిర్దిష్ట సమయంలో జవాబులు రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వలన పరీక్షపై ఉండే భయం తగ్గిపోతుంది. రోజూ కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేస్తే మెదడు చురుగ్గా పని చేస్తుంది. పరీక్షల సమయంలో అనవసరపు ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. ఈ జాగ్రత్తలను పాటించటం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించి సులభంగా విజయం సాధించవచ్చు.