విజయం మీదే : ఇలా చదివితే పోటీ పరీక్షల్లో విజయం మీ సొంతం
ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా చాలామంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఉన్నత స్థాయి ఉద్యోగాలు కావాలనుకునే వారు అన్ని రకాల పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికతో శ్రమిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ఉద్యోగాలకు ఎంపికైన వారు చెబుతున్నారు. కానీ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలనే విషయంపై చాలా మందికి సరైన అవగాహన లేదు.
లక్షల సంఖ్యలో అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొన్ని జాగ్రత్తలను పాటిస్తే గెలుపు శిఖరాలను అందుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు అంతకుముందు సంవత్సరం పరీక్షలు నిర్వహించిన బోర్డు వివరాలను తెలుసుకోవాలి. ప్రశ్నల ప్రాతిపదికన పరీక్షలకు సిద్ధం కావడంతో పాటు అవసరమైతే క్వశ్చన్ బ్యాంక్ సహాయం తీసుకోవాలి.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు సిలబస్ ప్రాతిపదికన పరీక్షలకు సిద్ధమవటంతో పాటు సమయ పాలనను చక్కగా పాటిస్తే విజయం సాధించవచ్చు. పాత ప్రశ్నాపత్రాలు, మోడల్ ప్రశ్నాపత్రాలలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇస్తూ సిద్ధం కావాలి. సమాధానాలు గుర్తించే సమయంలో చేస్తున్న తప్పులను గమనించి పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఆశించిన మార్కులు రావడం లేదంటే ప్రిపరేషన్ లో లోపాలు ఉన్నాయని గుర్తించాలి. ముఖ్యమైన పాయింట్లకు నోట్స్ తయారు చేసుకొని కరెంట్ అఫైర్స్ కు ఎక్కువగా పత్రికలపై ఆధారపడటం మంచిది. సబ్జెక్టును ఎంత అర్థం చేసుకుంటే అంత ప్రయోజనం ఉంటుంది కాబట్టి అదే మార్గంలో వెళ్లాలి.