సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసేది మీలాంటి వారినే మీరు వారి లిస్టులో ఉన్నారా?

RAMAKRISHNA S.S.
హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు! నగరంలోని ఒక ప్రముఖ వ్యాపారిని, ఆయన భార్యను లక్ష్యంగా చేసుకుని, కేవలం 'డిజిటల్ అరెస్ట్' అనే ఒక్క బెదిరింపుతో ఏకంగా ₹1.83 కోట్ల రూపాయలు కాజేశారు. సైబర్ నేరాలపై ఎంత ప్రచారం చేస్తున్నా, ఈ 'డిజిటల్ అరెస్ట్' అనే కొత్త మోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మోసగాళ్ల కొత్త ప్లాన్: సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్! .. ఇప్పటివరకు సీబీఐ, ఈడీ, సీఐడీ అధికారులమని బెదిరించిన సైబర్ నేరగాళ్లు, ఇప్పుడు తమ రూట్‌ను మార్చారు. ఈ తాజా కేసులో, నేరగాళ్లు తాము 'సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్' నుంచి మాట్లాడుతున్నామని చెప్పడం విశేషం. మోకిలాకు చెందిన ఆ వ్యాపారిని, ఆయన భార్యను టార్గెట్ చేస్తూ... మహిళల అక్రమ రవాణా కేసులో వారి పేర్లు ఉన్నాయంటూ భయపెట్టారు.



"మీరు బెంగళూరులో ఒక మహిళను వేధించిన కేసులో నిందితులు. కేసు నమోదైంది. మీరు వెంటనే స్టేషన్‌కు రాకపోతే, మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాం. మీరు మూడు నెలలు కస్టడీలో ఉండాల్సి వస్తుంది" అంటూ వరుసగా నలుగురైదుగురు వ్యక్తులు పోలీసు అధికారులమని చెప్పుకుంటూ బెదిరించారు. వీడియో కాల్ చేయాలంటూ బలవంతం చేశారు. డబ్బు వాపసు పేరుతో దోపిడీ! .. వ్యాపారి దంపతులు భయపడిపోవడంతో, నేరగాళ్లు తమ అస్సలు ప్లాన్‌ను అమలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యేవరకు డబ్బులను తాము చెప్పిన బ్యాంకు ఖాతాల్లో 'ట్రాన్స్‌ఫర్' చేస్తే, తర్వాత వాటిని రీఫండ్ చేస్తామని నమ్మబలికారు. అంతేకాదు, వ్యాపారి ఆధార్ నెంబరుతో పాటు, వారి బ్యాంకు ఖాతాల పూర్తి వివరాలను కూడా తెలుసుకున్నారు. ఈ విధంగా మొత్తం 1.83 కోట్ల రూపాయలను తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.



అంతటితో ఆగకుండా, ఆ వ్యాపారి భూములు, బంగారం వివరాలు కూడా సేకరించి, తమ ఇంటికి వస్తామని బెదిరించడంతో.. అనుమానం వచ్చిన వ్యాపారి తన సన్నిహితులకు విషయాన్ని చెప్పడంతో అది ఫేక్ స్కామ్ అని తేలింది. వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసుల హెచ్చరిక: భయపడకండి! .. సైబర్ నేరగాళ్లు తమ టార్గెట్‌గా ముఖ్యంగా వ్యాపారులను, వృద్ధులను ఎంచుకుంటున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ ఏజెన్సీ కానీ, పోలీసు అధికారులు కానీ ఫోన్ చేసి, 'డిజిటల్ అరెస్ట్' పేరుతో డబ్బులు డిమాండ్ చేయరని, బ్యాంకు వివరాలు అడగరని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మన నిర్లక్ష్యం, భయమే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి! తస్మాత్ జాగ్రత్త!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: