దొంగిలించిన రూ. 37లను, వడ్డీతో సహా తిరిగిచ్చేసిన వ్యాపారవేత్త!

praveen
అవును, మీరు ఆశ్చర్యపోతున్నా ఇది నిజమే. 1970 మధ్య కాలంలో సుబ్రమణ్యం, ఎలువాయి దంపతులు శ్రీలంకలోని నువారా ఎలియా జిల్లాలో మస్కెలియాకు సమీపంలోని అలకోలా ప్రాంతంలో ఉన్న తేయాకు తోటలో కూలీలుగా పని చేసేవారు. ఆ సమయంలో ఈ దంపతులు తమ ఇంటిని ఖాళీ చేసి, మరో చోటికి వెళ్లాలకున్నారు. ఈ క్రమంలోనే ఇంటిని ఖాళీ చేస్తోన్న తరుణంలో సహాయం కోసం వచ్చిన రంజిత్ అనే యువకుడు ఇంటిలోని ఒక దిండును తీస్తున్న సమయంలో, దాని కింద డబ్బును చూసాడు. ఆ డబ్బును లెక్కించగా రూ.37.50 పైసలు (శ్రీలంక కరెన్సీ) ఉన్నాయి. రంజిత్‌ ఆ మొత్తాన్ని ఆ ఇంటి యజమానులకు తెలియకుండా జేబులో వేసుకున్నాడు. తర్వాత కాసేపటికి, ఎలువాయికి దిండు కింద డబ్బులు పెట్టిన గుర్తుకు రావడంతో రంజిత్ పై అనుమానం వచ్చి డబ్బులు అడిగారు. కానీ, తాను ఆ డబ్బులను తీసుకున్నట్లు రంజిత్ అప్పుడు అంగీకరించలేదు.
రూ.37 అప్పటికి పెద్ద మొత్తమే అని చెప్పుకోవాలి. దాంతో ఎలువాయి డబ్బులు పోయిన విషయాన్ని చెప్పుకుని రంజిత్ వద్ద వాపోయాడు. ఇకపోతే, రంజిత్‌ది చాలా పెద్ద కుటుంబం. ముగ్గురు సోదరులు, ఇద్దరు అక్కలు. పేదరికంతో రంజిత్ రెండో తరగతికి మించి చదువుకోలేకపోయాడు. రంజిత్‌కు 17 ఏళ్లు ఉన్నప్పుడు, బతకడం కోసం తమిళనాడుకు వచ్చారు. ఈ క్రమంలో మొదట్లో ఇబ్బంది పడినప్పటికీ క్రమంగా తన పరిస్థితి పడడంతో డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఓసారి తన ఆరోగ్యం బాలేనప్పుడు బైబిల్ చదివానని, అందులో ‘‘దుష్టులు అప్పు తీర్చలేరు, నీతిమంతులు అప్పులను తిరిగి చెల్లిస్తారు!’’ అనే వాక్యం తనను ఆలోచింపజేసిందని రంజిత్ చెప్పారు.
ఈ క్రమంలో ఆ వృద్ధ దంపతుల నుంచి దొంగిలించిన 37.50 రూపాయలు గుర్తుకు వచ్చాయట. పైగా అప్పటికే ఆ వృద్ధ దంపతుల్లో అమ్మమ్మ (ఎలువాయి) చనిపోయారని తెలుసుకొని ఆ డబ్బును తిరిగి ఆమె వారసులకు ఇవ్వాలనుకుని నిర్ణయించుకొని శ్రీలంకలో ఉన్న స్నేహితుల ద్వారా వారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడట రంజిత్. సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులకు ఆరుగురు పిల్లలు అని తెలుసుకున్న రంజిత్ వీరికి ఫోన్ చేశారు. సుబ్రమణ్యం-ఎలువాయి దంపతులకు ఇవ్వాల్సిన డబ్బులను వారి పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నట్లు నిర్ణయించుకొని 2024 ఆగస్టులో కొలంబో వెళ్లిన రంజిత్, ఒక రెస్టరెంట్లో సుబ్రమణ్యం కుటుంబ సభ్యులను కలిశారు.
ఆ తరువాత వారికి 1970ల్లో జరిగిన సంఘటన గురించి చెప్పి,  వారి కోసం తీసుకొచ్చిన కొత్త బట్టలను ఇస్తూ, ఆ తర్వాత, తాను దొంగిలించిన రూ.37.50 మాత్రమే కాక, మురుగయ్య, పాలనియాంది, కృష్ణన్‌లకు ఒక్కొక్కరికీ రూ.70 వేల చొప్పున శ్రీలంక కరెన్సీని ఇచ్చారట. దాంతో సుబ్రమణ్యం-ఎలువాయి కుటుంబానికి ఇది ఆశ్చర్యకరంగా అనిపించిందట. దాంతో వారు ఈ కాలంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా? అని ఆశ్చర్యపోయారట. సరిగ్గా కష్టకాలంలో తాము ఉన్నపుడు ఆయన దేవుడిలా తిరిగి వచ్చి, మా చిరునామా కనుక్కొని మా డబ్బులు తిరిగి ఇవ్వడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది అని స్థానిక మీడియాతో చెప్పుకొచ్చారు. నిజంగా అద్భుతం కదూ!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: