బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ లాగా బాగా కండలు తిరిగిన బాడీతో ఓ బిల్డప్ బాబాయ్ ఓ బార్ అండ్ రెస్టారెంట్లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు..ఓ ఫైనాన్స్ కంపెనీ సిబ్బందిని బెదిరించేందుకు కత్తిపట్టుకుని రంగంలోకి దిగాడు.. ఏడు హత్యలు చేశాను.. ఇక మీ వంతేనంటూ బాగా రెచ్చిపోయాడు..తీరా సీన్ కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో మనోడు రియల్ లైఫ్ కిల్ బిల్ పాండే అయిపోయాడు.. తూచ్ ఏమీ లేదు. అంతా ఉత్తదే.. నన్ను నమ్మండి.. నాకు ఎలాంటి పాపం తెలీదు అంటూ ఆ బలరాముడు బిక్కమోహమేశాడు.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పట్టణంలోని హబీబ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీరుబార్లో బౌన్సర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి శుక్రవారం ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలోకి చొరబడి అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. తాను ఏడు హత్యలు చేశానని..
కత్తి పట్టుకుని అందర్ని బెదిరించాడు. ఈ ఘటన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బౌన్సర్‌ను అదుపులోకి తీసుకునేలోపు సుమారు 30 మందిని గంటపాటు బందీగా ఉంచారు. దీంతో బౌన్సర్ కన్నీరు పెట్టుకొని తనకు ఎలాంటి పాపం తెలియదంటూ ఎంతగానో ప్రాథేయపడ్డాడు.ఆ వ్యక్తిని శుభం ఠాకూర్ అలియాస్ బాద్షాగా గుర్తించారు పోలీసులు.
ఫైనాన్స్
కంపెనీ యజమాని భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. అతని కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి మార్చే ప్రక్రియలో ఉన్నాడు.
కంపెనీ సిబ్బంది అంతా షిఫ్టింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు ఠాకూర్ అక్కడికి చేరుకుని.. బెదిరించాడు. 'నా గురించి మీకు తెలియదు, నేను
బాద్షా ఠాకూర్‌ని. ఏడు హత్యలు చేశాను. ఈ ఆఫీస్ నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వను' అని ఠాకూర్ చెప్పి బెదిరించాడు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.దీనిపై సీపీ మకరంద్ డియోస్కర్ స్పందించారు. కంపెనీ యజమాని.. భవనం యజమాని మధ్య అద్దె విషయంలో కొంత వివాదం ఉంది. అదే ప్రాంతంలో బీర్ బార్‌ను నిర్వహిస్తున్న యజమాని, కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడానికి తన బౌన్సర్‌ను పంపాడని తెలిపారు. ఈ ఘటనపై బౌన్సర్, తోపాటు యజమానిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు.దీనిపై
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.