ఆదివారం... అమావాస్య... 108 కేజీల కారంపొడితో స్నానం..

Podili Ravindranath
పిచ్చి పలు రకాలుగా ఉంటుందట. దానికి మూఢ నమ్మకం తోడైతే... ఇక పరాకాష్ఠే మరి. అవును మరి... భక్తి పర్లేదు.. కానీ మూఢ భక్తి అంటే మాత్రం దానిని తట్టుకోలేరు కదా. ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. మొన్న ఆదివారానికి ఓ విశిష్టత ఉంది. అదే అమావాస్య ఆదివారం.. పైగా ఆషాడ మాసం ఆఖరి రోజు కూడా. వందేళ్లకు ఒకసారి వచ్చే పుష్యమీ నక్షత్రంలో అమావాస్య రోజు. ఇలాంటి రోజు వస్తుందని ముందు నుంచే బాగా ప్రచారం జరిగింది కూడా. ఆ రోజును తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా చాలా మంది ఘనంగా నిర్వహించారు. గృహిణులు తమ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకూడదని దిష్టీ తీశారు కూడా. కానీ తమిళనాడులో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

సాధారణంగా అమావాస్య రోజును తమిళులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా నదపనహళ్లి అనే గ్రామంలో పెరియ కరుప్పరసామి అనే స్వామికి ప్రతి ఏటా ఆషాడ అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాగే చేశారు. అయితే ఆలయ ప్రధాన పూజారి చెప్పినట్లుగా.... పాలల్లో కారంపొడి కలుపుకుని స్నానం చేసి... స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఇక స్వామి వారికి నైవేద్యంగా మద్యం, సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను సమర్పించారు. ఇక స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తుల నుంచి వారి విజ్ఞప్తులను ఆలయ ప్రధాన పూజారి స్వీకరించారు. అది కూడా రెండు కొడవళ్లపై కాళ్లు పెట్టి మరీ. ఇక చివరగా.. ప్రధాన పూజారి గోవిందన్... భక్తులు సమర్పించిన 108 కిలోల కారంపొడి కలిపిన నీటితో అభ్యంగన స్నానం చేశారు. ఇలా చేయడం వల్ల తమ గ్రామానికి ఎలాంటి దుష్టశక్తులు రావని... దురదృష్టం నుంచి భక్తులను స్వామి రక్షిస్తారని అక్కడి భక్తుల మూఢ నమ్మకం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: