అంగారకుడిపై ఇంకా నీరుంది.. ఎక్కడో తెలిసిపోయిందోచ్..

yekalavya
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షంపై ఎన్నోఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూమిలాంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయోమేనని వెదుకుతున్నారు. అలా వెదుకుతున్న క్రమంలో వారి దృష్టి ప్రధానంగా మన భూమి పక్కనే ఉన్న అంగారకుడిపై పడింది. అంగారకుడు పూర్తిగా డ్రై ప్లానెట్ అయినప్పటికీ ఆ గ్రహంపై ఎక్కడో ఒక చోట మానవాళి నివశించేందుకు లేదా ఇంతకుముందు నివశించినట్లు ఆధారాలు ఉండి ఉంటాయని శాస్త్రవేత్తలు నమ్మి పరిశోధనలు మొదలు పెట్టారు. దాదాపు శతాబ్ద కాలంగా జరుగుతున్న ఈ పరిశోధనలు మార్స్‌పైకి ఉపగ్రహాలను దించి అక్కడి వాతావరణాన్ని పరిశోధించే వరకు వచ్చింది. ఈ క్రమంలోనే అంగారకుడిపై మిలియన్ సంవత్సరాల క్రితం నీరు ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు తాజాగా ఆ నీరంతా ఎక్కడికి పోయిందో కూడా తెలుసుకున్నట్లు వారు చెబుతున్నారు.

మార్స్‌పై ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ప్రస్తుతం ఆ గ్రహం పైపొరలో బందీగా ఉందని వారంటున్నారు.  అంగారకుడి రాళ్లలో ఖనిజాల రూపంలో నిక్షిప్తమై ఉందని, 100 మీటర్ల నుంచి ఒక కిలోమీటరు లోతు వరకూ కప్పేయటానికి సరిపోయేంత నీరు ఒకప్పుడు ఆ గ్రహం మీద ఉండి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని గురించి 52వ లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో వారంతా చర్చించారు. అంతేకాకుండా కోట్ల సంవత్సరాల కాలంలో అంగారకుడిపై నీరంతా ఎలా మాయమైందనే వివరాలపై ఏకంగా ఓ కంప్యూటర్ నమూనానే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

‘మార్స్‌పై నీటిలో కొంత భాగం అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. ఇక ఉపరితలానికి కేవలం కొంచెం కింది భాగంలో గల మంచు నిల్వలు.. కొంత నీరు ఘనీభవించిన విషయాన్ని తెలియజేస్తున్నాయి. భూమికి అయస్కాంత రక్షణ కవచం - మాగ్నెటోస్ఫియర్ - ఉంది. భూమి నుంచి వాతావరణం బయటి విశ్వంలోకి జారిపోకుండా నిరోధించటానికి ఈ కవచం సాయపడుతుంది. కానీ మార్స్ మాగ్నెటిక్ షీల్డ్ బలహీనంగా ఉంది. దానివల్ల ఆ గ్రహం మీది నీటిలోని మౌలిక మూలకాలు గ్రహం మీది నుంచి అంతరిక్షంలోకి వెళ్లిపోయి ఉండవచ్చు. అయితే.. నీటిలోని ఒక రసాయన మూలకమైన హైడ్రోజన్ ఇప్పుడు ఆ గ్రహపు వాతావరణం నుంచి జారిపోతోంది. దీంతో కోట్ల సంవత్సరాల క్రితం మిగిలిన వాతావరణం కూడా ఇదే తరహాలో ఆ గ్రహం నుంచి విడిపడి విశ్వంలో కలిసిపోయి ఉండవచ్చనే అంచనా ఏర్పడుతోంది’ అంటూ లండన్‌లోని నాచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన డాక్టర్ పీటర్ వెల్లడించారు.

వాతావరణం మార్పులకు లోనైనప్పుడు, గ్రహాలు తనలోని నీటిని ఖనిజాలతో కలిపి దాచేస్తుంది. అంటే వాస్తవంలో ఆ నీరు చిక్కుబడిపోతుందని అధ్యయనం మరో సహ రచయిత, కాల్‌టెక్‌కే చెందిన ప్రొఫెసర్ బెథనీ హెల్మన్  వెల్లడించారు. మార్స్ మిషన్‌ల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేయటం ద్వారా.. నీరు రూపం మారిపోయిన ఆధారాలు లభించటం సాధారణమైన విషయమని, అరుదైన విషయం కాదని స్పష్టమైందిని ఆమె తెలిపారు. అంగారకుడి మీది నీటిలో అత్యధిక భాగం 410 కోట్ల సంవత్సరాల నుంచి 370 కోట్ల సంవత్సరాల కిందటి వరకూ క్రమంగా మాయమైందని, మార్స్ చరిత్రలో ఈ కాలాన్ని 'నోచియాన్ పీరియడ్'గా పిలవడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఇప్పుడు ఆ గ్రహంపై నీరంతా పై పొరల్లో చిక్కగా మారి ఖనిజాల రూపంలో ఉందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: