రోబో2లో సైన్స్ ఫిక్షన్ సీన్ కాదు.. ఫోటోషాప్ అంతకంటే కాదు.. ఇవి అసలైన పక్షులు
ఇక్కడ ఎగురుతున్న పక్షుల మేథస్సుకు ఎంతటి మానవ మైథస్సైనా దాసోహం అనాల్సిందే. ఐర్లాండ్‌లో బయటపడిన ఈ ఘటనకు ఓ ఫోటోగ్రాఫర్ సజీవ సాక్ష్యాలను సంపాదించాడు. అక్కడి పక్షులు చేసి ఓ వింతపని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ పక్షులు ఏం చేశాయో తెలుసా..? కలసికట్టుగా గాల్లో ఎగిరాయి. అంందులో వింతేముంది అంటారా..? కచ్చితంగా ఉంది. కావాలంటే ఈ వార్త చదవండి.
ఐరిష్ సరస్సుపై ఓ భారీ పక్షి ఎగురుతున్నట్లు ఉన్న ఓ ఫోటోను జేమ్స్ క్రోంబీ అనే ఫొటోగ్రాఫర్ తీశాడు. ఆ ఫోటోను ఒక్కసారిగా చూస్తే ఏమీ తెలియదు. కానీ కొంత పరికించి చూస్తే అసలు విషయం అర్థమై మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఎదుకంటే ఆ పెద్ద పక్షి ఒక్కటి కాదు. వేల సంఖ్యలో పక్షులన్నీ కలిసి ఒక్కటిగా చేరి అతి పెద్ద పక్షి ఆకారంలో మారి ఎగురుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ భారీ పక్షి ఎగురుతూ వస్తున్నట్లు కనిపించే ఈ వీడియో, ఫోటోలను చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.
నిజానికి పక్షులెప్పుడూ ఓ క్రమ పద్ధతిలో ఎగురుతుంటాయి. ఈ క్రమంలో ఐర్లాండ్‌లోని సరస్సు పైనుంచి వెళ్తున్న సమయంలో వాటి ఆకారం పెద్ద పక్షిని తలపించింది. మార్చి 2న ఈ పక్షుల గుంపును జేమ్స్ తన కెమెరాలో బంధించాడు. ముల్లింగర్ పట్టణ సమీపంలోని వెస్ట్మీత్ వద్దనున్న లో ఎన్నెల్ కో(లోచ్ ఎయినిన్) సరస్సు వద్ద ఈ దృశ్యాన్ని అతడు చూశాడు. పక్షులన్నీ కలిసి ఒక పెద్ద పక్షిగా కనిపించడమే కాదు, దాని ఆకారం సరస్సు నీటిలో ప్రతిబింబించడం చూసిన జేమ్స్ వాటిని ఫోటో తీయాలనుకున్నాడు.
జేమ్స్ స్వతహాగా ఓ స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్. అయితే గత కొంతకాలంగా ఇతర అంశాలపైనా దృష్టిసారించాడు. పక్షులు ఓ ఆకారంలో ఎగరడాన్ని గమనించి వెంటనే దానిని తన కెమెరాలో బంధించాడు. స్పష్టమైన, కచ్చితమైన ఆకారాన్ని ఫొటో తీసేందుకు 400 నుంచి 500 షాట్స్ తీశానని, చివరికి అనుకున్నది సాధించానని సంతోషంతో చెప్పాడు. దీనికోసం జేమ్స్ ఇప్పటికే అక్కడికి కనీసం 50 సార్లు వెళ్లాడట. మరి అంత పట్టుదలగా ప్రయత్నించాడు కాబట్టే ఇంత ఫలితం దక్కింది. ఐర్లాండ్‌లో క్రోంబీకి మంచి పేరుంది. ఐర్లాండ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి ‘ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా జేమ్స్ ఇప్పటికే దక్కించుకున్నాడు.