రాష్ట్రంలోని వేలాదిమంది శ్రామిక మహిళలకు కనీస వేతనాల జీవోలను విడుదల చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపే అర్హత ఉందా..? అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. సాయిబాబు సూటిగా ప్రశ్నించారు. మహిళలందరూ ఆత్మాభిమానంతో,ఆనందంగా, హాయిగా బతకాలనే ఉద్దేశంతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం రాష్ట్రంలో ఆనవాయితీ అని తెలిపారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలోని శ్రామిక మహిళలు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలను సవరించాలని,ప్రభుత్వం విడుదల చేసిన ఐదు జీవోలను గెజిట్ చేయాలని, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలనే డిమాండ్ల పై శుక్రవారం సిఐటియు ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని కార్మిక శాఖ కమిషనరేట్ వద్ద సిఐటియు నగర అధ్యక్షుడు కె.ఈశ్వరరావు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. సాయిబాబు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి వాస్తవానికి కార్మిక శాఖ అయినా, ఆయన యాజమాన్యాలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పరిశ్రమ అధిపతులకు ఉడిగం చేస్తున్న కార్మిక శాఖ అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, లేదంటే ఆ శాఖ ఆఫీసులకు యాజమాన్యాల శాఖ అనే బోర్డులు తగిలిస్తామంటూ హెచ్చరించారు. ఈశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి, మంత్రులు,ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి కానీ కాంట్రాక్టు కార్మికులు, శ్రామికుల వేతనాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి గోస ప్రభుత్వానికి పట్టదా..?అని ప్రశ్నించారు.
ఈ అంశంలో సర్కారు తన తీరును మార్చుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మోడీ సర్కారు తీసుకొస్తున్న లేబర్ కోడ్ లు అత్యంత ప్రమాదకరమైనవి. వాటికి వ్యతిరేకంగా సిఐటియు, ఎర్ర జెండా, టిఆర్ఎస్ కేవి గులాబీ జెండా, బీఎం ఎస్ కాషాయ జెండా తో పాటు ఇతర కార్మిక సంఘాల జెండాలన్ని కలసి పోరాడాల్సిన అవసరముందని.. ఇక్కడ జెండాలు కాదు ముఖ్యం, కార్మికుల హక్కులు ముఖ్యం.. అని ఆయన సూచించారు.