అర్ధరాత్రి దొరికిన 18 లక్షలు.. ఆ వ్యక్తి చేసిన పనికి..

yekalavya
విశాఖపట్టణం: ‘నాది కానిది ఎన్ని కోట్లైనా నాకు అక్కరలేదు.. అదే నాది అర్థరూపాయైనా నేను వదిలిపెట్టను’ ఈ డైలాగ్ ఓ తెలుగు సినిమాలో హీరో చెబుతాడు. అచ్చం ఆ హీరోలానే.. విశాఖలో ఓ కుర్రాడు కూడా తనవి కాని లక్షల రూపాయలను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఫ్రీగా వస్తే పైసా కూడా వదిలిపెట్టని ఈ రోజుల్లో కూడా ఇలాంటి గొప్ప పని చేసి నిజాయితీని చాటుకున్న ఆ యువకుడి పేరు ప్రీతం.
విశాఖలోని కంచరపాలేనికి చెందిన ప్రీతం ప్రతి రోజులాగే తన పని ముగించుకుని ఇంటికెళుతున్నాడు. అయితే దారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్దకొచ్చేసరికి అతడికో ఏటీఎం కార్డు దొరికింది. ఆ ఏటీఎంను చేతికి తీసుకున్న ప్రీతం దానిపై పిన్ నెంబరు కూడా ఉండడం గమనించాడు. దీంతో ఆ ఏటీఎంను జాగ్రత్తగా తీసుకెళ్లి బార్ అండ్ రెస్టారెంట్ వాళ్లని విచారించాడు. అయితే వారు తమకు ఆ ఏటీఎం ఇవ్వాలని, ఎవరైనా వస్తే ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ప్రీతం అంగీకరించలేదు. వారిని తన పేరు, నెంబరు ఇచ్చి వచ్చేశాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలని అనుకున్నా.. అప్పటికే రాత్రి 10 గంటలు దాటిపోయింది. ఇక చేసేదేం లేక ఇంటికి బయలుదేరాడు. పిన్ నెంబర్ ఉండడంతో అసలు ఎంత క్యాష్ ఉంది..? అనేది చూడాలనుకున్నాడు. దగ్గరలోని ఏటీఎంలో చెక్ చేశాడు. అంతే మతి పోయినంత పనైంది. ఎందుకంటే ఆ కార్డు ఖాతాలో ఏకంగా రూ18 లక్షలున్నాయి.
అది చూసి కూడా ఎలాంటి దుర్బుద్ధీ లేకుండా ప్రీతం ఇంటికెళ్లిపోయాడు. ఉదయాన్నే స్థానిక కంచరపాలెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పి ఏటీఎం కార్డును అప్పగించాడు. అక్కడి ఎస్సై అప్పలనాయుడు వెంటనే ఓ కానిస్టేబుల్‌తో పాటు ప్రీతంను బ్యాంకు పంపించాడు. ఆ ఏటీఎం కార్డు కంచరపాలెం పరిధిలో సుభాష్ నగర్‌లో నివసిస్తున్న ఆనంద్ ఉదయ్‌దిగా గుర్తించారు. కానిస్టేబుల్ ఆనంద్‌కు ఫోన్ చేసినా స్విచ్ ఆప్ రావడంతో అతడి ఇంటికెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. స్టేషన్‌కు వచ్చాక ప్రీతం చేతులమీదుగానే ఎస్సై అప్పలనాయుడు ఆ కార్డును ఆనంద్‌కు అప్పగించారు.
ఈ నేపథ్యంలో ఆనంద్ మాట్లాడుతూ, తన భార్య ఇటీవలే మరణించిందని ఆమె పేరు పై 18 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ అయ్యాయని, అవే ఆ డబ్బులని చెప్పాడు. తన ఏటీఎంను తిరిగి ఇచ్చిన పోలీసులకు, ముఖ్యంగా నిజాయితీగా వ్యవహరించిన ప్రీతంకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రీతంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏటీఎం కార్డులు తస్కరించి ఎకౌంట్లో డబ్బులను గుల్ల చేస్తున్న ఈ రోజుల్లో... తనకు దొరికిన ఏటీఎం కార్డు లో 18 లక్షలు ఉన్నాయ్ అని తెలిసినా.... పోలీసుల ద్వారా బాధితుడికి అప్పగించి తన నిజాయితీని చాటుకోవడాన్ని అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: