బుల్లిపిట్ట: కేవలం 500 రూపాయలకే మినీ కూలర్ ని కనిపెట్టిన తెలుగు కుర్రోడు..!
ఇప్పుడున్న ప్రపంచంలో చాలా టెక్నాలజీ అవసరం. అంతే కాకుండా డబ్బులు చాలా పొదుపు చేసుకోవడం కూడా అంతే అవసరం. ఇక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. అందులో అందరూ కూలర్ ,ఏసీ , ఫ్రిడ్జ్ కొంటారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంతో కొనవలసి ఉంటుంది. అలాకాకుండా 500 రూపాయలకే మినీ కూలర్ ని తయారు చేశాడంట మా తెలుగు కుర్రాడు. ఎవరో.. ఎక్కడో..ఎలా కనిపెట్టారో.. ఇప్పుడు చూద్దాం.
సంవత్సరాల నుంచి కొత్త పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఆ కుర్రాడు తన చుట్టూ ఉన్న జనాలను చూసి, ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకొని , అతనికి ఒక ఆలోచన తట్టింది . అది కాస్త ట్రావెలింగ్ మినీ కూలర్ తయారీకి కారణమైంది. కేవలం రెండు రోజుల్లోనే 500 రూపాయలతో మినీ కూలర్ ని తయారు చేసిన అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్ జగిత్యాల జిల్లా కోరుట్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్ 7 ఏళ్ల క్రితం డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత సొంతంగా శ్రీ వినాయక ఎలక్ట్రికల్ రివైండింగ్ వర్క్ షాప్ పెట్టుకున్నాడు. చిన్నప్పుడు నుంచి శ్రీకాంత్ కి ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం.ఆ ఇష్టంతోనే రీసెంట్ గా మినీ కూలర్ ని తయారు చేశాడు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో సామాన్య ప్రజలు కూడా కొనే వీలుగా తయారు చేశాడు.
ఎలా తయారు చేశాడంటే.. 15 కిలోల కాళీ వంట నూనె డబ్బా తీసుకుని దానికి ఒక చిన్న మోటార్ బిగించాడు.అందులో రెండున్నర లీటర్ల నీళ్లు లోపలికి బయటికి రావడానికి ప్లాస్టిక్ వాటర్ పైపులు కనెక్ట్ చేశాడు. వాటికి రెండు వైపులా ఇనుప జాలరీ బిగించి, వాటికి గడ్డిని అమర్చాడు. మోటర్ తిరగడానికి కరెంటు వైర్ కనెక్షన్ ఇచ్చి, ట్రావెలింగ్ మినీ కూలర్ తయారు చేశాడు.12 ఇంచులు పొడవు, 9 ఇంచుల వెడల్పు ఉన్న ఈ కూలర్ ఎక్కడికైనా వెంట తీసుకు వెళ్ళవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్లకు ,పార్టీలకు ,హాస్పిటల్లో రోగులకు, మరియు పేద వారికి ఈ కూలర్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు శ్రీకాంత్. అంతేకాకుండా తనకు తగిన ప్రోత్సాహం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేయడానికి రెడీ అంటున్నాడు శ్రీకాంత్.