కరోనా ఎఫెక్ట్.... మరో సంచలన నిర్ణయం తీసుకున్న వాట్సాప్...?
దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5000కు చేరువలో ఉంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లలో కరోనా గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వార్తల్లో నిజాల కంటే అబద్ధాలే ఎక్కువగా ఉండటం గమనార్హం. కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఆపేందుకు వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వాట్సాప్ యాప్ లో తరచుగా షేర్ అయ్యే మెసేజ్ లను ఒకరికి మాత్రమే షేర్ చేసే విధంగా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇప్పటివరకు వాట్సాప్ ద్వరా ఒకసారి ఐదుగురికి మెసేజ్ పంపే వీలు ఉండగా ఇకనుంచి కేవలం ఒకరికి మాత్రమే ఫార్వర్డ్ చేసే వీలు ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల వాట్సాప్ మెసేజ్ లను ఫార్వర్డ్ చేయడం 25 శాతం మేర తగ్గుతుందని ఆ సంస్థ చెబుతోంది.
త్వరలో వాట్సాప్ వినియోగదారులు తమకు వచ్చే మెసేజ్ లను ధృవీకరించుకునే సదుపాయం కూడా కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో బీటా వెర్షన్ లో అందుబాటులో ఉన్న ఈ సదుపాయం త్వరలో వాట్సాప్ వినియోగదారులందరికి అందుబాటులోకి రానుంది. వాట్సాప్ సంస్థ 1 మిలియన్ డాలర్లను తమ వంతు సాయంగా విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సంస్థ కరోనా గురించి సమాచారం ఇచ్చే కరోనా ఇన్ఫర్మేషన్ హబ్ ను కూడా ఏర్పాటు చేసింది.