ధోని శిష్యుడు.. ఒక కూలి కొడుకు.. ఇది మీకు తెలుసా?

frame ధోని శిష్యుడు.. ఒక కూలి కొడుకు.. ఇది మీకు తెలుసా?

praveen
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25 సీజన్‌లో 5 వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. అందులో ప్రధానమైనది డివాన్ కాన్వే ప్లేస్‌లో తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌కి అవకాశం ఇవ్వడం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో 20 ఏళ్ల 202 రోజుల వయసులో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన షేక్ రషీద్, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఓపెనింగ్ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించిన సంగతి విదితమే. రషీద్ వస్తూనే, ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో 3 ఫోర్లు బాది వారెవ్వా అనిపించాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కూడా 2 ఫోర్లు బాది అందరికీ ఆకర్శించాడు. దాంతో ఇంతకీ ఎవరీ షేక్ రషీద్? అని చాలామంది అంతర్జాలంలో తెగ వెతికేస్తున్నారు.

షేక్ రషీద్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పాతమల్లాయపాలెం గ్రామంలో జన్మించాడు. తండ్రి బాలీషావలి ఓ సాధారణ కూలీ కావడం గమనార్హం. హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటర్‌గా పనిచేసిన బాలీషావలి, కొడుకు కెరీర్ కోసం ఉద్యోగం వదిలేసి మరీ మంగళగిరికి మకాం మార్చాడు. అండర్16లో సత్తా చాటిన షేక్ రషీద్, అండర్19 టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత యువ జట్టుకి వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆ టోర్నీలో 4 మ్యాచుల్లో 201 పరుగులు చేసిన షేక్ రషీద్, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 108 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 94 పరుగులు చేసి, టీమిండియా ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

సదరు మ్యాచ్ లో కెప్టెన్ యశ్ ధుల్‌తో కలిసి రషీద్ మూడో వికెట్‌కి 204 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి సత్తా చాటాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 84 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసి, భారత జట్టు విజయంలో తన వంతు పాత్రని విజయవంతంగా పోషించాడు. అయితే, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల 2022 మెగా వేలంలో షేక్ రషీద్ పాలుపంచుకోలేక పోయాడు. అయితే, 2022 అండర్19 వరల్డ్ కప్‌లో పర్ఫామెన్స్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ 2023 ఐపీఎల్ మెగా వేలంలో షేక్ రషీద్‌ని రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది. అయితే టీమ్‌లో ఉన్న మిగిలిన యంగ్ ప్లేయర్ల మాదిరిగానే షేక్ రషీద్ కూడా ఒక్క అవకాశం కోసం రెండేళ్లకు పైగా ఎదురుచూడాల్సి వచ్చింది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: