షాకింగ్ : ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ రద్దు.. టీమ్ ఇండియానే కారణం?
నవంబర్ 11న జరగనున్న ఈ ఈవెంట్‌తో టోర్నమెంట్‌కు అధికారికంగా తెరలేపాలని ఐసీసీ భావించింది. అయితే ఇంకా పరిష్కారం కాని సమస్యల కారణంగా ఈ ప్రణాళికలు నిలిచిపోయాయి. ప్రధాన సమస్య ఏంటంటే, భారతదేశం పాకిస్థాన్‌లో ఆడటానికి ఇష్టపడడం లేదు. టోర్నమెంట్ షెడ్యూల్ ఇంకా చర్చల్లో ఉందని ఐసీసీ అధికారి ఒకరు వెల్లడించారు. "షెడ్యూల్ ఖరారు కాలేదు. మేం ఇప్పటికీ ఆతిథ్య దేశం, ఇతర దేశాలతో చర్చలు జరుపుతున్నాము. ఒకసారి ఖరారు అయితే మేం అధికారిక ప్రకటన చేస్తాము" అని ఆ అధికారి క్రిక్‌బజ్‌కు తెలిపారు.
ఐసీసీ ఈవెంట్ రద్దు చేయడానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పకపోయినా, బీసీసీఐ టీమిండియాను పాకిస్థాన్‌కు పంపడానికి ఇష్టపడకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తోంది. అంతేకాకుండా, లాహోర్‌లో కాలుష్యం ఎక్కువగా ఉండటాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి కారణంగా చూపించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీని లాహోర్, రావల్పిండి, కరాచీ వంటి పాకిస్తాన్‌లోని అనేక నగరాలలో నిర్వహించాలని ప్రణాళిక చేశారు. కానీ, భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. దీంతో ఈ టోర్నమెంట్‌ను భారత మ్యాచ్‌లు సహా కొన్ని మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలనే ఆలోచన ప్రారంభమైంది.
ఇది ఇలా ఉంటే పీసీబీ చైర్మన్ మొహసిం నక్వి, భారతదేశం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆయన అన్నారు. "బీసీసీఐ లేదా ఐసీసీ నుంచి హైబ్రిడ్ మోడల్ గురించి మాకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు, కానీ దీని గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని నక్వి అన్నారు. మొదట భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న న్యూజిలాండ్‌తో, మార్చి 1న పాకిస్తాన్‌తో లాహోర్‌లో మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు మ్యాచ్‌ల స్థలాన్ని మార్చే అవకాశం ఉంది.