పంత్ జాతకమేంటో.. ముందే చెప్పేసిన నేటిజన్.. వేణు స్వామి కంటే పర్ఫెక్ట్ చెప్పాడే?
ఇంతకు ముందు మహేంద్ర సింగ్ ధోనీ కూడా టెస్ట్ మ్యాచ్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యారు. అంటే, భారత జట్టులో 99 పరుగుల వద్ద ఔటయ్యిన రెండవ వికెట్ కీపర్ రిషభ్ పంత్ అయ్యాడు. రిషభ్ పంత్ ఇప్పటికే ఏడు సార్లు టెస్ట్ మ్యాచ్‌లలో 90 పరుగులకు పైగా స్కోర్ చేసి ఔటయ్యాడు. ఇది చాలా అరుదుగా జరిగే సంఘటన. భారత జట్టులో ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే రిషభ్ పంత్ కంటే ఎక్కువ సార్లు 90లలో ఔటయ్యారు.
రిషభ్ పంత్ గత సంవత్సరం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది మళ్ళీ జట్టులోకి వచ్చాడు. కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఈ న్యూజిలాండ్ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేయాలని అనుకున్నాడు కానీ అదృష్టం వరించలేదు. ఈ మ్యాచ్‌లో మూడో రోజు రిషభ్ పంత్ ఆడలేదు. నాలుగో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఇదిలా ఉండగా రిషభ్ పంత్ 99 పరుగుల వద్ద ఔటైన సంఘటన సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది. పంత్ కరెక్ట్ గా 99 వద్ద అవుట్ అవుతాడని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్)లో మ్యాచ్ జరగకముందే పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ నిజమయింది అంటే అతడు చెప్పినట్లే పంత్ కరెక్ట్ గా 99 దగ్గర అవుట్ అయ్యాడు. దీని గురించి తెలుసుకున్న చాలామంది అలా ఎలా చెప్పావు బ్రో? నీకేమైనా జాతకం తెలుసా, నా జాతకం కూడా చెప్పు బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఏమో వేణు స్వామి కంటే ఇతడే కరెక్ట్ గా భవిష్యత్తును చెబుతున్నాడే అని కామెంట్లు చేశారు. కొంతమంది అతన్ని మ్యాచ్ ఫిక్సర్ అని అనుమానిస్తున్నారు. మరికొందరు రిషభ్ పంత్ ఆయన వల్లే ఔటయ్యాడని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఈ నెటిజన్ చేసిన ప్రిడిక్షన్ కరెక్ట్ కావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.