బుజ్జగింపులు మొదలు.. కెప్టెన్సీతో పాటు రోహిత్ కు ముంబై భారీ ఆఫర్?
ఐపీఎల్ మెగా వేలంలో రోహిత్ ముంబై నుంచి బయటికి వస్తాడని వార్తలు వస్తున్నాయ్. ఈ క్రమంలోనే అతన్ని దక్కించుకునేందుకు మిగతా ఫ్రాంచైజీలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. మెగా వేలం నిబంధనల ప్రకారం ఒక జట్టు గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన ఆటగాళ్లని వేలంలోకి వదిలేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూల్ ను మార్చి.. 8 మందిని తీసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు ఐపీఎల్ గవర్నమెంట్ కౌన్సిల్ ను కోరుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అటు కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ రోహిత్ శర్మను తమ టీం నుంచి వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల తమ బ్రాండ్ వేల్యూకు తీవ్ర నష్టం జరిగిందని గుర్తించిన ఆ జట్టు యాజమాన్యం.. ఇక రోహిత్ శర్మ జట్టును వదిలి మరో టీం లోకి వెళ్లకుండా ఉండేలా బుజ్జగింపులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆకాష్ అంబానీ రోహిత్ శర్మతో కారులో ప్రయాణించినట్లు సమాచారం. అవసరమైతే ముంబై ఇండియన్స్ సారధ్య బాధ్యతలను తిరిగి మళ్లీ రోహిత్ కి కట్టబెట్టేందుకు కూడా జట్టు యాజమాన్యం సిద్ధంగా ఉందట. 2024 ఐపీఎల్ సీజన్ సెకండ్ హాఫ్ లోని ఈ నిర్ణయం తీసుకోవచ్చని వాదన కూడా వినిపిస్తుంది. అదే సమయంలో రోహిత్ ఇక ముంబైని వీడకుండా ఉండేందుకు ఆ జట్టు యాజమాన్యం భారీ ఆఫర్ కూడా ఇచ్చిందట. ఏకంగా తమ వ్యాపారాల లో భారీ విలువైన షేర్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఏం జరగబోతుందో చూడాలి.