
లెక్క తప్పింది.. ముంబై అతన్ని వదులుకోకుండా ఉండాల్సింది?
ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి ఇక ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు... అనంతరం రెండు పరాజయాలు నమోదు చేసింది ముంబై ఇండియన్స్. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎట్టకేలకు విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. ముంబై ఇండియన్స్ ను అటు బౌలింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. సీనియర్ పియూస్ చావ్లా తప్ప మిగతా ఎవరూ కూడా పరుగులు కట్టడి చేయడం లేదు. ఇక ఒక్కో మ్యాచ్ లో ఒక్కో బౌలింగ్ లైన్ అప్ తో బరిలోకి దిగుతుంది.
సింపుల్ గా చెప్పాలి అంటే జట్టులో బుమ్రా రాలేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ సమయంలోనే ముంబై ఒక యువ బౌలర్ను వదులుకొని తప్పు చేసింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2022 మెగా వేలంలో మయాంక్ మార్కండేను 65 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. 2022లో అతడికి కేవలం రెండు మ్యాచ్ లలోనే అవకాశం వచ్చింది. తర్వాత అతని 2023 మినీ వేలంలో వదిలేసింది. దీంతో 50 లక్షలకు సన్రైజర్స్ అతని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సన్రైజర్స్ బౌలింగ్ ను ముందుండి నడిపిస్తున్నాడు మాయాంక్ మార్కండే. ఆరు మ్యాచ్ లలో పది వికెట్లు తీశాడు. ఎకానమీ 6.43గా ఉంది. ఇది చూసి మయాంక్ మార్కండేను ముంబై ఇండియన్స్ వదులుకోకుండా ఉండాల్సింది అంటూ అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.