ఐపీఎల్ లో కొంత మంది ఆటగాళ్లు కొన్ని జట్లకు ఆడితేనే చూడటానికి బాగుంటుంది... ధోని.. చెంన్సీ సూపర్ కింగ్స్ కి... కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కి... రోహిత్ ముంబై ఇండియన్స్ కి... అలాగే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కి ఆడితేనే చూడాలనిపిస్తుంది. కానీ గత సీజన్‌లో టీమ్‌మేనేజ్‌మెంట్‌తో వార్నర్‌కు బేధాభిప్రాయాలు తలెత్తగా.. అతని పేలవ ఫామ్ కూడా తోడవడంతో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ వేటుకు గురైన వార్నర్.. ఆ తర్వాత జట్టులోనే చోటు కోల్పోయాడు.
అయితే గత ఏడాది సన్ రైజర్స్ హెడ్ కోచ్ ట్రెవర్ బేలిస్, మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్‌తో టీమ్ సెలెక్షన్ విషయంలో డేవిడ్ వార్నర్‌కు బేధాభిప్రాయాలు వచ్చాయి. దాంతో అతన్ని పక్కనపట్టేసారు. కానీ.. ఇప్పుడు వచ్చే సీజన్ కు సన్‌రైజర్స్ తమ కోచింగ్ స్టాఫ్ ను మార్చుకుంది. మాజీ కోచ్ టామ్ మూడీ మళ్లీ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. సౌతాఫ్రికా పేస్ గన్ డేయిల్ స్టెయిన్ బౌలింగ్ కోచ్‌గా, సైమన్ కటీచ్ అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ క్రమంలోనే టామ్ మూడీ నేతృత్వంలోని హైదరాబాద్ మేనేజ్‌మెంట్ డేవిడ్ వార్నర్‌ను మళ్లీ తీసుకోవాలని భావిస్తోందంట.
అయితే కెప్టెన్‌గా కేన్ విలియమ్సనే కొనసాగుతాడని, కేవలం ప్లేయర్‌గా మాత్రమే వార్నర్‌ను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల వేలంలో డేవిడ్ వార్నర్ కోసం పోటీ పడే అవకాశం ఉందని టీమ్‌కు చెందిన ఓ అధికారి పేర్కొన్నాడు. కానీ మెగా వేలంలో వార్నర్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. లీగ్‌లో ఎంతో అనుభవం, విన్నింగ్ కెప్టెన్ కావడంతో అతని కోసం భారీ ధరైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కనీస ధర 2 కోట్లకు అందుబాటులో ఉన్న వార్నర్‌కు సుమారు రూ.15 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది.