ఆ ఒక్కడే న్యూజిలాండ్ స్పిన్నర్లను కుమ్మేశాడు...

VAMSI
న్యూజిలాండ్ భారత్ పర్యటనలో తడబడుతోంది. టీ 20 సిరీస్ నుండి మొదలైన ఈ తడబాటు రెండు టెస్ట్ ల సిరీస్ లోనూ కొనసాగుతోంది. మొదటి టెస్ట్ లో ఓటమి నుండి తప్పించుకుని బయటపడిన కివీస్, రెండవ టెస్ట్ లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. అయితే రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ కు గాయం కావడంతో ఆఖరి నిమిషంలో టామ్ లాతం కు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చారు. టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఆరంభంలో ఇండియా ఓపెనర్లు మంచి ఇన్నింగ్స్ నిర్మించారు. కానీ స్పిన్ ను అంచనా వేయడంలో విఫలమయిన శుభమాన్ గిల్ తృటిలో అర్ద సెంచరీని మిస్ చేసుకున్నాడు.
ఇక అక్కడి నుండి ఇండియా వరుస వికెట్లను కోల్పోయి 80 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా కెప్టెన్ కోహ్లీ మరియు పూజారులు డక్ అవుట్ కావడం అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. ఈ దశలో ఫస్ట్ టెస్ట్ హీరో శ్రేయాస్ అయ్యర్ మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు జత కలిశాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఈ దశలో మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మళ్ళీ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. వీరిద్దరి మధ్య సరిగా 80 పరుగుల భాగస్వామ్యం నమోదయింది. 160 పరుగుల స్కోర్ వద్ద ఇండియా నాలుగవ వికెట్ కోల్పోయింది.
ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా మొక్కవోని దీక్షతో మయాంక్ అగర్వాల్ నిలబడిపోయాడు. భారత్ వికెట్లు అన్నీ కూడా కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ కు సమర్పించుకుంది. కానీ అదే స్పిన్నర్ ను మయాంక్ మాత్రం సిక్స్ లు పోర్లతో పరుగులు పెట్టించాడు. ఏ ఒక్క స్పిన్నర్ ను కూడా వదలకుండా అందరినీ  ఒక ఆట ఆడుకున్నాడు. అలా మయాంక్ తన కెరీర్ లో ఒక అద్బుతమయిన సెంచరీని సాధించాడు. ఇది తన కెరీర్ లో నాలుగవ సెంచరీ కావడం విశేషం. ఇక ఫోర్త్ డౌన్ లో వచ్చిన కీపర్ సాహా మయాంక్ కు చక్కని సహకారం అందించాడు. మరో వికెట్ కోల్పోకుండా ఇండియా ఈ రోజును ముగించింది. మయాంక్ 120 పరుగులు మరియు సాహా 25 పరుగులతో నాట్ అవుట్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: