జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడిన క్రీడాకారులకు పతకాలు రాగా దేశం మొత్తం ఆనందపడింది. అయితే దేశంలో ఎంతో మంది క్రీడాకురులకు సరైన అవకాశాలు లేక వారు పతకాలు తీసుకొచ్చేంత దూరం వరకు వెళ్లలేకపోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ సరైన ప్రోత్సాహకాలు లేక వారు అలానే గ్రామీణ భారంతలోనే ఉండిపోతున్నారని చెప్తున్నారు. పలు స్పోర్ట్‌లో హయ్యెస్ట్ పొజిషన్ వరకు వెళ్లి ప్రతిభ కనబర్చిన వారు కొంతమంది గ్రామీణ నేపథ్యమున్న క్రీడాకారులు చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి వారి గురించి మీడియాలో కథనాలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో వారిని ప్రోత్సహించేందుకు కొన్ని సేవా సంస్థలు, ఎన్జీవోలు ప్రయత్నించినప్పటికీ వారిని గేమ్స్‌లో సెలక్ట్ చేసేప్పుడు పాలిటిక్స్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. క్రీడా రాజకీయాల మధ్య సదరు ప్రతిభ కలిగిన క్రీడాకారుల కెరీర్ ఎండ్ అయిపోతున్నదని తెలుస్తోంది. ఆడే సత్తా ఉన్నప్పటికీ ఆయా క్రీడాంశాల్లో కనీసం పాల్గొనే చాన్స్ కూడా వారికి దక్కడం లేదని కొందరు అంటుంటారు. ఇకపోతే మహిళా క్రీడాకారిణులకు చాలా కష్టాలు ఉంటాయి. వారి క్రీడలు ఆడుకునే క్రమంలో శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కోకుండా ఉండేందుకుగాను ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే వారు కరణం మల్లేశ్వరీ, మీరాభాయి చాను, పీవీ సింధు మాదిరిగా భారతదేశ జెండాను ప్రపంచ పటం మీద ఎగురవేసేందుకుగాను కృషి చేస్తారు.
మన దేశంలో ప్రతిభ మాత్రమే క్రీడాకారులుగా ఎంపికకు కొలమానం కావడం లేదన్న ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. సామాజిక వర్గం, ప్రాంతం, మతం వంటి అంశాలు తీవ్ర ప్రభావితం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో పీవీ సింధు మెడల్ సాధించిన సందర్భంగా అభినందనలు చెప్పాల్సిందిపోయి కొందరు ఆమెది ఏ కులం? ఏ మతం? గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిభే కొలమానంగా పట్టం కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయాల్సి ఉంది. క్రీడాకారులను ఎంపిక చేసే సెలక్టర్లు కూడా ఏదో ఒక వర్గం వైపు మొగ్గు చూపొద్దు. అలా చేయడం వల్ల మట్టిలో మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతున్నాయి. ఓ సర్వే ప్రకారం భారతేదేశంలో 90 శాతం మంది బ్రాహ్మణ సామాజిక వర్గం వారు మాత్రమే క్రికెటర్స్‌గా కెరీర్ ఉండాలనుకుంటున్నారని, మిగతా పదిశాతం మంది మాత్రమే క్రికెటర్లుగా రాణించాలనుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరికి అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.