హెచ్‌సీఏ ఫ్రీ వ్యాక్సినేష‌న్ క్యాంప్ ప్రారంభం

Sanjay

హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్ సీఏ) విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉప్ప‌ల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన‌ కొవిడ్‌-19 వ్యాక్సినేష‌న్ శిబిరాన్నిక్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఉప్ప‌ల్ స్టేడియంలో రెండు రోజులు పాటు ఈ ఫ్రీ వ్యాక్సినేష‌న్ శిబిరం కొన‌సాగుతుంద‌ని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. హెచ్‌సీఏ క్ల‌బ్ సెక్ర‌ట‌రీలు, ఇత‌ర సిబ్బంది, క్రికెట‌ర్లు వారి కుటుంబ స‌భ్యులు ఈ వ్యాక్సినేష‌న్ శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. శిబిరానికి ఎక్కువ మంది వ‌చ్చే అవ‌కాశ‌మున్నందున వ్యాక్సిన్ల‌ను త‌గిన‌న్ని అందుబాటులో ఉంచుకోవాల‌ని వైద్య సిబ్బందిని మంత్రి సూచించారు. టీకాలు వేయించుకోవ‌డానికి వ‌చ్చిన‌వారికి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్ల‌న్నీ ప‌క‌డ్బందీగా చేయాల‌ని క్రీడాశాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.


వ్యాక్సినేష‌న్ శిబిరాన్ని ప్రారంభించాక హెచ్‌సీఏ కార్య‌వ‌ర్గ స‌భ్యులు మంత్రికి స్టేడియం మొత్తాన్నిచూపించారు. స్టేడియం అభివృద్ధి విష‌యంలో ప్ర‌భుత్వం త‌ర‌ఫున పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని.. ఈ సంద‌ర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. అనంత‌రం హెచ్‌సీఏ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ మాట్లాడుతూ అసోసియేష‌న్ స‌భ్యులు, సిబ్బంది, తాజా, మాజీ క్రికెట‌ర్లకు ఉప్ప‌ల్ స్టేడియంలో ఫ్రీ వ్యాక్సినేష‌న్ క్యాంప్ నిర్వ‌హించాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్ట‌ర్ జి.శ్రీనివాస్‌రావుకు లేఖ రాసిన‌ట్టు చెప్పారు. దానికి ఆయ‌న వెంట‌నే స్పందించి ఉప్ప‌ల్‌లో వ్యాక్సినేష‌న్ క్యాంప్ ఏర్పాటు చేయాల‌ని మేడ్చ‌ల్‌, హైద‌రాబాద్ డీఎమ్‌హెచ్ఓల‌ను ఆదేశించార‌ని తెలిపారు. రెండ్రోజులు పాటు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు టీకాలు వేస్తార‌ని.. వ్యాక్సినేష‌న్‌కు వ‌చ్చే వారు ఆధార్ కార్డు.. సంబంధిత గుర్తింపు కార్డులు తీసుకొనిరావాల‌ని విజ‌యానంద్ తెలిపారు. స‌స్పెన్ష‌న్‌కు గురైన భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్‌, హెచ్‌సీఏ అధ్య‌క్షుడు అజారుద్దీన్ ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండ‌గా తాత్కాలిక అధ్య‌క్షుడు జాన్ మ‌నోజ్‌, స‌హాయ కార్య‌ద‌ర్శి న‌రేష్ శ‌ర్మ, ప‌లువురు క్ల‌బ్ కార్య‌ద‌ర్శులు, క్రికెట‌ర్లు  త‌దిత‌రులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hca

సంబంధిత వార్తలు: