క్రీడా రంగంలో రాణించిన సూపర్ మామ్స్ వీళ్ళే..!
భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టన్ అయిన అనిత పాల్‌దురై ఎన్నో రికార్డులు సృష్టించింది. ఏసియన్ బాస్కెట్ బాల్ కాన్ఫెడరేషన్ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా 9 సార్లు పాల్గొన్న ఏకైక, మొదటి మహిళ అనిత. 2013లో ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి ఫిట్‌నెస్ సాధించి తిరిగి బాస్కెట్ బాల్ కోర్టులోకి అడుగు పెట్టింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా ఎన్నో రికార్డులు ఆమె సొంతం. గ్రాండ్ స్లామ్ సాధించిన ఏకైక భారత మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్న అనంతరం ఒక బాబుకు తల్లైంది.
అంతేకాదు భారత చెస్ చరిత్రలో రెండో మహిళా గ్రాండ్ మాస్టర్‌గా రికార్డులకు ఎక్కిన కోనేరు హంపి గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె 2006 ఏషియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణపతకాలు సాధించింది. పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లైన తర్వాత రెండేళ్ల పాటు చెస్‌కు దూరంగా ఉన్న హంపీ.. తిరిగి 2019లో సర్క్యూట్‌లోకి అడుగుపెట్టింది. 2019లో వరల్డ్ చాంపియన్‌షిప్ గెలుచుకొని 2600 ఎల్లో రేటింగ్ మార్కును దాటింది.
ఇక భారత స్టార్ రెజ్లర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నది. 2012 ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్.. ఇప్పటి వరకు ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఏకైన మహిళా బాక్సర్‌గా రికార్డులకు ఎక్కింది. పెళ్లి చేసుకొని నలుగురు పిల్లలను కన్న తర్వాత కూడా బాక్సర్‌గా రాణిస్తూనే ఉన్నది.
అలాగే డిస్కస్ త్రోలో అనేక రికార్డులు నెలకొల్పిన కృష్ణ పూనియ మూడు సార్లు ఒలంపిక్స్‌లో పాల్గొన్నది. ఆమె 2010లో కామన్వెల్స్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. తన కోచ్ వీరేందర్ పూనియాను 2001వలో పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూనే ఉన్నది.