శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్.. తిరుమల చరిత్రలోనే?
ఎప్పుడు చూసినా శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా మొన్నటివరకూ శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. అటు టీటీడీ అధికారులు నిబంధనలు విధించడం కారణంగా ఎంతోమంది భక్తులు ఇక తిరుమల వెళ్ళాలి అనే ఆలోచనను విరమించుకున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగి ఉండటంతో ఇక తిరుమల వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అంతేకాకుండా కరోనా సమయంలో ఒక్కసారిగా పడిపోయిన శ్రీవారి హుండీ ఆదాయం ఇప్పుడు అంతకంతకు పెరుగుతూ వస్తుంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం తిరుమలలో శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది అన్నది తెలుస్తుంది. ఇటీవలే సోమవారం నుండి ఆదాయం లెక్కించగా 6.18 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఇక తిరుమల చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆరు కోట్ల మార్కును హుండీ ఆదాయం దాటడం గమనార్హం. ఇక దీనికి ముందు 2012 ఏప్రిల్ 1వ తేదీన 5.73 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఆదాయం గా కొనసాగుతోంది. కానీ ఇప్పుడు మాత్రం భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఏకంగా శ్రీవారికి 6.18 కోట్ల ఆదాయం ఒకేరోజులో వచ్చింది.