తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ రద్దు...!

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. నిత్యం గోవింద నామ స్మరణతో ఆ ఏడుకొండలు మారుమోగుతూ ఉంటాయి. దేవ దేవుని దర్శనానికి నిత్యం వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఇక భోగ శ్రీనివాసుని వైభోగం వర్ణించాలంటే మాటలు చాలవు. నిత్య కల్యాణం.. పచ్చ తోరణం అనే నానుడి ఆ ఏడుకొండల వాడి వైభోగం చూసిన తర్వాతే వచ్చింది. ఇక స్వామి వారికి నిత్యం ఎన్నో రకాల సేవలు జరుగుతూ ఉంటాయి. తోమాల సేవ, అర్చన, అభిషేకం, నిజపాద దర్శనం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ, పవళింపు సేవ, ఆరగింపు... ఇలా ఎన్నో సేవలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే వీటన్నికంటే ముందుగా స్వామి వారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ప్రతి రోజు తెల్లవారుజామున స్వామి వారిని సుప్రభాతంతోనే మేలుకొలుపు వినిపిస్తారు. ఆ తర్వాత అన్ని కైంకర్యాలు ప్రారంభం అవుతాయి. ఈ సుప్రభాత సేవ సమయంలో భక్తులు వెయ్యి కళ్లతో స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి దర్శనంతో తమ జన్మ దన్యం అయినట్లు భావిస్తారు.
డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం. ఈ నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2022, జనవరి 14న ముగియనున్నాయి. ఆగమ శాస్త్రంలో ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది.      పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌... గోదాదేవి ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: