కార్తీక మాసంలో ఈ 4 పనులు తప్పకుండా చేయండి
హిందూ క్యాలెండర్లో కార్తీక ఎనిమిదవ నెల. ఈ నెల అక్టోబర్ 21 గురువారం నుండి ప్రారంభం అయ్యింది. విష్ణువు కార్తీక మాసంలో తన నాలుగు నెలల నిద్రను పూర్తి చేసి, ఏకాదశి రోజున మేల్కొంటాడు. దీనితో చాతుర్మాసము ముగిసిపోతుంది. అన్ని శుభ కార్యాలు మళ్లీ ప్రారంభమవుతాయి. ఈ నెలలో లక్ష్మి దేవి భూమిని సందర్శించడానికి వస్తుందని అంటారు. మీరు కూడా కార్తీక మాసంలో లక్ష్మీదేవి, నారాయణుల ఆశీస్సులు పొందడానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ పేర్కొన్న 4 పనులు ఖచ్చితంగా చేయండి.
1. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి
ఇంతకుముందు సంగతి ఎలా ఉన్నా కార్తీక మాసంలో రోజూ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది చాలా పవిత్రమైనది. మీరు పవిత్రమైన నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. చేయలేకపోతే సాధారణ నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి మీరు స్నానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు.
2. తులసిని పూజించండి
గ్రంథాలలో తులసి ఒక పవిత్రమైన మొక్క. దీనిని ప్రతిరోజూ పూజించాలని సూచించారు. కానీ కార్తీక మాసంలో తులసికి ప్రత్యేక పూజ చేసే ఆచారం ఉంది. ఈ నెలలో విష్ణువుతో తులసి వివాహం కూడా జరుగుతుంది. కార్తీక మాసంలో ఒక నెల పాటు నిరంతరం తులసి ముందు దీపం పెట్టడం వలన అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడింది.
3. దీపం దానం చేసేలా చూసుకోండి
కార్తీక మాసంలో దీపం దానం చేయడం ద్వారా ఇంట్లో చీకటి మాయమవుతుంది. ప్రతికూలత నశిస్తుంది. సానుకూలత వ్యాపిస్తుంది. కాబట్టి ఈ మాసంలో దేవాలయం, పుణ్యక్షేత్రం, తులసి, పవిత్ర నది లేదా చెట్టు మొదలైన వాటి కింద ఖచ్చితంగా దీపాలను పెట్టాలి. దీని కారణంగా ఇంట్లో డబ్బు, ఆహార కొరత ఉండదు.
4. దానం చేయడం చాలా శుభప్రదం
దానధర్మాలను గ్రంథాలలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది మీ చెడు కర్మను తొలగిస్తుంది. జీవితాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం కార్తీక మాసంలో అవసరమని చెబుతారు. ఆహారం, తులసి మొక్కను దానం చేయడం, ఆవు దానం చేయడం పుణ్యంగా భావిస్తారు. పేదలకు మీ సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా దానం చేయవచ్చు.