వరలక్ష్మీ వ్రతం: సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిన పనులివే

VAMSI
శ్రావణమాసం ప్రత్యేక పూజలకు పెట్టింది పేరు, మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు అలాగే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలు ఎంతో విశిష్టంగా చేస్తుంటారు. నేడు శ్రావణమాసంలో వచ్చిన శుక్రవారం అందరి ఇళ్ళలో వరలక్ష్మీ వ్రతాల సందడి నెలకొంది. ఇంటికి పచ్చ తోరణాలు, వాయినాలు తీసుకునే ముత్తైదువులు, పసుపు కుంకుమలు, అమ్మవారి అలంకరణ ఇలా ఎంతో సందడిగా ప్రతి ఇంటా పండగ వాతావరణం నెలకొంది. నేడు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో నిష్టగా, భక్తి శ్రద్ధలతో చేస్తుంటారు మహిళలు. అయితే వరలక్ష్మీ వ్రతం చేసుకున్న సాయంత్రం తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి.
ఇవి అందరికీ తెలిసుండకపోవచ్చు, లేదా అవగాహన లేక పోవచ్చు. అవేంటో తెలుసుకుని ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా వరలక్ష్మీ వ్రతాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తే ఆ శ్రీ మహా లక్ష్మి కరుణా కటాక్షలు పొందగలరు.  చాలామంది వరలక్ష్మీ వ్రతాన్ని పొద్దున్నే చేస్తుంటారు. ఏ మాత్రం లోటు లేకుండా పూజను ఉన్నంతలో ఎంతో ఆర్భాటంగా చేయాలనుకుంటారు.  అమ్మవారి అనుగ్రహం కోసం ముత్తైదువులకు వాయినాలు కూడా ఇస్తుంటారు. పసుపుతో చేసిన అమ్మవారు, అలాగే పసుపుతో చేసిన గణపతిని పూజలో ఉంచి వ్రతాన్ని చేస్తారు. అయితే కొంతమంది సాయంత్రం మాత్రం పూజ చేయరు. ఉదయం ఎంతో శ్రద్ధగా పూజ చేశాం కదా, ఇక ఇప్పుడు సాయంత్రం పూజ చేయనక్కర్లేదులే అని భావిస్తారు. మరికొందరు పూజ చేస్తారు కానీ నైవేద్యం వంటివి ఏమి పెట్టకుండానే కేవలం దీపారాధన చేసి మమ అనుకుంటుంటారు.
అయితే ఇలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు వేదపండితులు. ఇంట్లో ఉదయం వరలక్ష్మీ వ్రతం చేసాము అంటే .. సాయంత్రం కూడా ఖచ్చితంగా నిత్య దీపారాధన చేయాలట. అంతే కాకుండా సాయంత్రం మరల ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలట. ఉదయం అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులు అందరూ  తప్పకుండా స్వీకరించాలి. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజున సాయంత్రం కూడా మరల తియ్యటి నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ అనంతరం ఆ నైవేద్యాన్ని చిన్నారులకు ప్రసాదంగా ఇస్తే వ్రత ఫలితం పూర్తిస్థాయిలో దక్కుతుందట. కాబట్టి ఉదయం వరలక్ష్మీ వ్రతం ఎంత వైభవంగా చేసినా సరే... మరలా సాయంత్రం పూట కూడా ప్రత్యేక నైవేద్యం సమర్పించి నిత్య దీపారాధన చేయాలనీ గుర్తుంచుకోండి. ఇలా చేయడం వలన అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు మీ ఇంట  కొలువై ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: