శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా వచ్చే శ్రావణ మంగళవారాలతోపాటు శ్రావణ శుక్రవారాలు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది..ఎందుకు అంటే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు కాబట్టి. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మీ రూపంలో కొలుచుకుంటాము. కుల , మత, జాతి , వర్గ భేదాలు లేకుండా అలాగే ఎటువంటి ఆడంబరాలు లేకుండా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం చేస్తూ ఉంటారు.
అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలో ఒక్కసారి పూర్తిగా తెలుసుకుందాం..
వరలక్ష్మీ వ్రతం ముందు రోజున ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలను చక్కగా పసుపు తో అలంకరించి , కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక పూజ చేసే రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి , ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి. లక్ష్మీదేవిని ఈశాన్యదిక్కున పూజిస్తే మేలు అని చెబుతారు. కాబట్టి ఇంటి ఈశాన్య దిక్కులో ముగ్గులు వేసి, పూజ స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక ఆ ముగ్గు పైన ఒక పీటను పెట్టి, ఆ పీటకు పసుపు , కుంకుమలతో అలంకరించాలి.
పీట పైన ఒక తెల్లటి వస్త్రం పరిచి ,దాని మీద బియ్యం పోసి, బియ్యం మీద కలశాన్ని ప్రతిష్టించాల్సి ఉంటుంది. కలశం చెంబు కు పసుపు ,కుంకుమలు అద్ది, దాని మీద టెంకాయను పెట్టాలి. ఆ కొబ్బరికాయ మీద పసుపు ముద్దతో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దితే మరీ శుభప్రదం. ఇక కలశం మీద కొబ్బరికాయ తోపాటు మామిడి ఆకులను కూడా ఉంచడం శుభకరం. కలశానికి ఇరువైపుల ఏనుగు ప్రతిమలను పెట్టడం మరిచిపోకూడదు. అమ్మవారిని అష్టోత్ర నామాలతో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. మూడు లేదా ఐదు తోరాలను తయారు చేసుకోవాలి. ఈ తోరాళ్ళ కోసం దారాలకు పసుపు రాస్తూ , తోరపూజ లోని ఒక మంత్రం చదువుతూ ఒక్కొక్క ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి. అలా ముడి వేసిన చోట పువ్వులతో ముడి వేస్తూ, కుంకుమ పెట్టాల్సి ఉంటుంది.
ఇక అమ్మవారికి నైవేద్యంగా.. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతి కాబట్టి, ఆవు నెయ్యి తో దీపం వెలిగించడం , ఆవునెయ్యితో పరమాన్నం చేయడం వంటివి చేయాలి. ఇక ఆ తర్వాత శక్తికొలది వంటలను చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. కొబ్బరికాయ, అరటిపండు తప్పకుండా నివేదించాల్సి ఉంటుంది. తర్వాత అష్టోత్తర నామావళి, కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు కచ్చితంగా ప్రసన్నం అవుతారు.
పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారి గా భావించి, ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. ఇక శాఖాహారం మాత్రమే వారు భుజించిన తర్వాత వారిని పంపించాలి. ఆ తరువాత ఇంట్లో వారు భోజనం చేయాల్సి ఉంటుంది. ఇక సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి, తాంబూలాలను ఇవ్వాలి.ఇలా చేయడంవల్ల ఆడవారి జీవితంలో సౌభాగ్యం , సంతానం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
శ్రీ గౌరీ నమోస్తుతే..