హిందువులకు నిత్య పూజలు చేయటం ఎప్పటి నుండో ఆచారంగా వస్తోంది. ముఖ్యంగా మంగళ, గురు, శుక్రవారాలలో ప్రత్యేకించి ఎక్కువగా పూజలు చేస్తుంటారు. ఇక పండుగలు వస్తే మరీ ప్రత్యేకం. పచ్చటి తోరణాలు, రంగులతో నిండిన ముగ్గులు, కొత్త వస్త్రాలు, పిండి వంటలు ఇలా అంతా సందడిగా ఉంటుంది. కానీ ఈ పండుగలు ఒక రోజో లేదా రెండు రోజులు మాత్రమే. అదే తెలుగు మాసాలలో వచ్చే ఐదవ మాసం శ్రావణ మాసం వస్తే మాత్రం ప్రతి రోజు పండగే. మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా పెళ్ళయిన స్త్రీలకు శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైన, ముఖ్యమైన మాసం. పెళ్లిళ్ల ముహూర్తాలకు శ్రావణమాసం అత్యంత అనువైన మాసంగా మన శాస్త్రాలు చెబుతున్నాయి.
అందుకని ఎంతో మంది ఆలస్యమైనప్పటికీ శ్రావణమాసంలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటుంటారు. ఈ మాసంలో వివాహం చేసుకున్న జంటకు ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం కలకాలం ఉంటుందని ఒక విశ్వాసం. అంతే కాకుండా ఈ మాసంలో ఎవరైతే శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం మరియు లక్ష్మీ వ్రతాలు చేస్తారో వారి సౌభాగ్యం మరింత బలంగా మారి చిరకాలం మీరు పసుపు కుంకుమలతో చల్లగా ఉంటారని వేదశాస్త్రములు చెబుతున్న మాట. అందుకే ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం మరియు వరలక్ష్మీ వ్రతాలు ఎంతో నిష్టగా భక్తిశ్రద్ధలతో చేస్తుంటారు. ఈ వ్రతాలు చేసే సమయంలో ఉపవాస దీక్షలు వుండి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. శ్రావణమాసం మొదలైన రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అంతేకాకుండా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మరియు మంగళవారం రోజున ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తుంటారు. తద్వారా మన ఇల్లు సుఖసంతోషాలతో నిండి అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని నమ్మకం. ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు విశిష్టమే... శ్రావణమాసం మొదలైన ఐదవ రోజు వచ్చే పండుగ నాగపంచమి ఈ పండుగను మహిళలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వదినాన నాగరాజును భక్తితో కొలుస్తారు. అంతే కాకుండా ఈ శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన పండుగలు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణ జన్మాష్టమి, మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. అలా ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో, పసుపు కుంకుమలతో, పిండివంటలతో, ప్రతి ఇల్లు కళకళలాడుతుంటుంది.