శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల దివ్యక్షేత్రం నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. కరోనా కారణంగా భక్తుల రద్దీ తగ్గినప్పటికీ.. నిత్యం 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయంలో అన్ని కైంకర్యాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. శ్రావణ మాసంలో స్వామి వారికి పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి అంతరాలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు రుత్వికులు ముహూర్తం ఖరారు చేశారు. శ్రావణ పౌర్ణమి ముందు స్వామి వారికి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆనంద నిలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
ఈ నెల 17వ తేదీన ఆలయంలోని మహా మండపంలో వేద మంత్రాల నడుమ అంకురార్పణతో ఉత్సవాలు  ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి  లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు తిరుమల గిరులపై 15 - 16 శతాబ్ధాల వరకు జరిగినట్లు ఆధారాలున్నాయి. 1962 వ సంవత్సరం నుంచి  తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాఢ వీధుల్లో ఊరేగి.. భక్తులను కటాక్షిస్తారు. ఆగస్టు 18న పవిత్ర ప్రతిష్ఠ, ఆగస్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల కారణంగా ఆగస్టు 18 నుంచి 20 వరకు వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. అదే విధంగా ఆగస్టు 17న అంకురార్పణ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవను రద్దు చేసింది. కొవిడ్ నేపథ్యంలో శ్రీవారి పవిత్రోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: