ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడే ప్రముఖ దేవాలయాలు కరోనా కారణంగా పెట్టిన లాక్ డౌన్ తో భక్త జనం లేక వెలవెల బోతున్నాయి. అలాగే భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఒడిస్సా రాష్ట్రంలో పూరీలో జరిగే జగన్నాథుని రథయాత్రకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో భక్తులు తరలి వస్తారని తెలిసిందే. దాదాపు పది రోజులు పాటు ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలు మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న కారణంగా ఈసారి కూడా పోయిన ఏడాది లాగే పెద్దగా భక్తులు లేకుండానే అంతంత మాత్రంగానే జరగనుంది. ఈ ఏడాది (2021) జూలై 12 న ప్రారంభం కాబోయే పూరి జగన్నాథుని రథయాత్ర సంబరాలకు కరోనా నిబంధనలు ఆంక్షలు విధించాయి.
కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో జగన్నాథుని రథోత్సవాలకు భక్తులను అనుమతించడం లేదని తెలుపుతున్నందుకు చింతిస్తున్నాం అంటూ ఒడిస్సా రాష్ట్రం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటిలాగే భక్తులతో జగన్నాధుని రథోత్సవం జరిగితే వైరస్ వ్యాప్తి పెరిగి మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చే అవకాశం ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాక రథయాత్ర రోజు పూరీలో కర్ఫ్యూ అమలు చేయబోతున్నట్లు తెలిపింది. అయితే కరోనా నిబంధనలు పాటిస్తూ కొద్ది మంది పండితులు, పరిమిత భక్తుల మధ్య జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇక పరిమిత భక్తులు ఎవరు అన్న విషయానికి వస్తే, ఎవరైతే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుని ఉంటారో, అదే విధంగా తాజాగా కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్న వారికి అనుమతి లభిస్తుందని సమాచారం. జూలై 20 కి జగన్నాథ రథయాత్ర వేడుకలు ముగుస్తాయి. పరిమిత స్థాయిలో రథయాత్ర చేస్తున్నప్పటికీ ఆచార వ్యవహారంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, ఎప్పటి లాగే రథయాత్ర సంబరాల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. అంతా బాగుంటే వచ్చే ఏడాది అయినా ఘనంగా జరుపుకోవచ్చు అని పేర్కొన్నారు.