హనుమాన్ జయంతి: ఆంజనేయుడి అనుగ్రహం కోసం ఇలా పూజించండి...?
హనుమాన్ జయంతి నాడు... తెల్లవారుజామునే లేచి, తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటిని శుభ్రపరిచి పూజామందిరాన్ని ప్రత్యేకంగా అలంకరించాలి. ఆ అలంకరణలో తమలపాకులు ఉండేలా చూసుకోవాలి. అనంతరం ముందుగా గుడికి వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో చేసిన మాలను ఆ శ్రీ ఆంజనేయునికి సమర్పించుట మంచిది. ఇక ఇంటి లోని పూజా మందిరంలో.. పూజ చేయు విధానం. ముందుగా పంచముఖ ఆంజనేయ ప్రతిమను కానీ, ఫోటోను కానీ పూలతో అలంకరించి... ఎర్రటి అక్షింతలు సిద్ధం చేసుకోవాలి.
పక్కనే శ్రీ రాముని విగ్రహాన్ని లేదా ప్రతిమను కూడా ఉంచుకోవాలి. జిల్లేడుతో చేసిన ఒత్తులతో... దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితం అందుతుందని మరియు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని ప్రతీతి. పూజ చేసే సమయంలో హనుమాన్ చాలీసా కానీ... లేదా ఓం ఆంజనేయాయ నమః.. జై వీరాంజనేయ వంటి నామాలు 108 సార్లు జపిస్తూ పూలతో పూజించాలి. అదే విధంగా శ్రీ ఆంజనేయునికి సమర్పించిన ప్రసాదాన్ని చిన్న పిల్లలకు ఇవ్వడం మంచిది. అలాగే ఆంజనేయస్వామి లాకెట్ ఉంచి పూజ చేసి... ఆ లాకెట్ ను మీ చిన్నారులకు వేస్తే అంతా మంచే జరుగుతుంది.