కనుమ పండుగ విశిష్టత ఏమిటో తెలుసా ...?

VAMSI
హిందువులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మొదటి పర్వదినాన భోగి అని, రెండవ పర్వదినాన్ని సంక్రాంతి అని, మూడో పర్వదినాన్ని కనుమగా జరుపుకుంటున్నాము. పెద్ద పండుగ చివరి ఘట్టమైన కనుమ పండుగ ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కనుమ పండుగ ను పశువుల పండుగ అని కూడా సంబోధిస్తుంటారు. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఈ పండుగను ఎంతో ప్రత్యేకంగా ఓ వేడుకలా జరుపుతుంటారు.

కనుమ నాడు కాకి అయినా మునక వేస్తుంది అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. దీని అర్థం కనుమ పండుగ నాడు ఖచ్చితంగా తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి. వ్యవసాయంలో... మన జీవన విధానంలోనూ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటున్న పశువులకు కృతజ్ఞతలు తెలుపుతూ... వాటిని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఒక ఆ ఏడాది మొత్తం మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా... ఎంతో సంతోషంగా ఉంటుందని మన పూర్వీకులు చెబుతున్నారు. మన చేతికి వచ్చిన పంట వలన కలిగిన ఆనందాన్ని మనమే కాకుండా పశువుల తోనే పంచుకునేలా ఈ పండుగ రూపొందింది.

ఈ పర్వదినాన వన భోజనాలు కూడా చేస్తుంటారు. మినుములతో చేసిన వంటకాలను ఎక్కువగా తినడం  మంచిదని భావిస్తారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తోంది. పచ్చని తోరణాలతో ఇంటిని అలంకరించి... పక్షుల కోసం ధాన్యపు కంకులను ఇంటి ముందు కడుతుంటారు. ఇలా చేయడం వలన అది సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తాయని ఒక నమ్మకం. కనుమ పండుగ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. ఇలా  కనుమ పండుగ నాడు రథం ముగ్గు వేసి పెద్ద పండుగను ఘనంగా సాగనంపుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: