అయ్యప్ప భక్తులకు కరోనా టెస్ట్ కంపల్సరీ...!

SS Marvels
విజయదశమి కనకదుర్గ అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలు ఇటీవలే ఘనంగా ముగిశాయి. ఇక అతి త్వరలో శబరిగిరి వాసుడు అయ్యప్ప స్వామి వారి దీక్షలు మొదలు కానున్నాయి. గతం కన్నా ఈసారి పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయంలోకి కేవలం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. మండల పూజలు నవంబరు 16 నుంచి ప్రారంభం కానుండగా.. రోజుకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం వెల్లడించారు. అయితే సెలవు రోజులు మరియు మకర సంక్రాంతి సమయంలో గరిష్ఠంగా 5వేల మంది వరకు భక్తులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మండల, మకరవిళక్కు సీజన్‌లో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకోవాలని, నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. అంతేకాదు, ఆలయం వద్ద విధులు నిర్వర్తించేవారికి కూడా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే వారికి చికిత్స కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. ఒకవేళ తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ మహమ్మారి దేశంలో విజృంభించడంతో ఆరు నెలల పాటు మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం అక్టోబరు 17న తొలిసారి మాస పూజల కోసం తెరిచి, భక్తులను దర్శనానికి అనుమతించారు. ఐదు రోజుల పాటు రోజుకు సగటున 250 మందిని మాత్రమే దర్శనానికి అనుమతించారు. ఇక, మండల పూజలకు నవంబరు 16న ఆలయం తెరుచుకోనుండగా... డిసెంబరు 27 వరకు భక్తులను అనుమతిస్తారు. తర్వాత మూడు రోజుల పాటు మూసివేసి తిరిగి మకరవిళక్కు పూజల కోసం తెరిచి జనవరి 20న పడిపూజ తర్వాత మూసివేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: