షిర్డీ సాయిబాబా అద్భుత ప్రబోధనలు!
సాయి తత్వం భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, ఋజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. ఎవరికీ అర్థంకాని ఉపనిషత్తులలోని భావాలను, వేదాల్లోని సారాన్ని బాబా చిన్న చిన్న మాటలు, హితోక్తులతో సులభంగా అర్థమయ్యేలా చెప్పారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు సాయిబాబా బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలనుండి సాయిబాబాను దైవ స్వరూపునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. బాబా మసీదులో నివసించారు. గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంభించారు.
బాబా రెండు సంప్రదాయాల పదాలను, చిత్రాలను ఉపయోగించారు. బంధుమిత్రులు లేదా పరిచయస్తులు డబ్బు అవసరం ఉండి, లేదా మరేదో సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే సాయం చేయి. ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే, లేదా సాయం చేయలేకపోతే చేయకు. కానీ, వారిని విసుక్కోకు. ఈసడించుకోవడం, సహించలేనివిధంగా దుర్భాషలాడటం చేయకు. అవతలి వ్యక్తే నీతో దురుసుగా, పరుషంగా, నొప్పించేవిధంగా మాట్లాడినా, అనవసర నిందలు వేసినా, లేనిపోని ఆరోపణలు చేసినా ఉదారంగా ప్రవర్తించు. కఠినంగా జవాబులు చెప్పకు అవతలి వ్యక్తి నిందలు మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. తిరిగి నిష్ఠూరంగా మాట్లాడ్డం వల్ల నీకు ఒనగూరే లాభమూ లేదు.
అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి, ఔదార్యం చూపడంవల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా ఉండు. జరుగుతున్నదంతా నాటకం అని భావించి, ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో.. అహంకారాన్ని పోగుట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో, నీకు, నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ఇద్దరిమీ ఒకటే అవుతాం. నీకు, నాకు బేధం ఉండి అనుకోకు. ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది. ఈ బేధ భావం నీలో నెలకొని ఉంటే, నువ్వు, నేను ఒకటి కాలేము...'' సాయిబాబా బోధనలు చదివి వదిలేయకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం.