మర్రిచెట్టులో వెలసిన వేంకటేశ్వరుడు.. ఎక్కడంటే??
విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడే వేంకటేశ్వరుడు అంటే తెలుగు వారికి పరమ ప్రీతి. ఎక్కడున్న ఎంతో భక్తితో స్వామిని కొలుస్తారు. వేం అంటే పాపాలు.. కట అంటే నశింపచేసేది.. మనుషుల పాపాలను నశించచేసే ‘వేంకటేశ్వర స్వామి’గా కోట్లాది భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తున్నాడు. వేంకటేశ్వరుడు, వేంకటాచలపతి, శ్రీనివాసుడు ఇలా ఎన్నో పేర్లతో పిలిచే వేంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా ఎందరో భక్తులు ఉన్నారు. ఇక కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఎక్కువగా కొండలపై వెలసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.
అలాంటి ఆ స్వామి 'మర్రి చెట్టు'లో వెలసిన క్షేత్రమే 'మల్లాది'గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి కి కొంత దూరంలో ఉన్న మల్లాది గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామివారు మర్రిచెట్టులో వెలిశాడని ఎంతో మహిమగల వాడని చెబుతారు. స్థల పురాణానికి వస్తే.. పూర్వం ఇక్కడ గ్రామస్తులు విశేషమైన రోజుల్లో వేంకటేశ్వరస్వామిని పూజించుకోవాలనుకుంటే ఆ పక్కనే వున్న మరో గ్రామానికి వెళ్లవలసి వచ్చేదట.
ఆ సమయంలో కృష్ణానదిని దాటడానికి వాళ్లు చాలా ఇబ్బందులు పడేవాళ్లట. దాంతో స్వామివారు ఆ భక్తులను అనుగ్రహించడం కోసం, ఈ గ్రామంలోని మర్రిచెట్టు 'మాను'లో వెలిశారని చెబుతారు. ఒకసారి తుఫాను రావడంతో ఈ మర్రి చెట్టు పూర్తిగా నేలకి ఒరిగిందట. దారికి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో కొమ్మలను తీసేశారట. ఆ సమయంలో మర్రి చెట్టుమాను ఓంకార శబ్దం చేస్తూ యథాస్థానంలో నిలిచిందని చెబుతారు. ఇక అప్పుడు గ్రామస్తులంతా కూడా ఆ చెట్టుని దర్శించుకున్నారు. అలాగే ప్రతి సంవత్సరం జనవరి 22 వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం, తిరునాళ్ల జరుపుచున్నారుస్వామివారు. ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నారని చెబుతూ.. భక్తి శ్రద్ధలతో అక్కడ గ్రామస్తులు పూజిస్తుంటారు.