ప్రపంచంలో కూర్మావతారంలో ఉన్న ఏకైక దేవాలయం ఎక్క‌డ ఉందో తెలుసా..?

Kavya Nekkanti

హిందూ మత సంప్రదాయంలో త్రిమూర్తులుగా కొలువబడే ముగ్గురు ప్రధాన దేవుళ్ళలో `విష్ణువు` ఒక‌డ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక విష్ణువు దశావతార రూపుడన్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ప్రతి రూపానికి సంబంధించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆల‌యాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ, ఒకే ఒక రూపానికి సంబంధించి మాత్రం ఈ ప్ర‌పంచంలో ఒకే దేవాలయం ఉంది. అదే కూర్మావతారానికి సంబంధించిన దేవాలయం. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాల లో రెండవ అవతారం కూర్మావతారము. కూర్మము అనగా తాబేలు.

శ్రీ కాకుళం నుండి 15 కి.మీ. దూరాన శ్రీకూర్మం గ్రామంలో `కూర్మనాధ స్వామి` ఆల‌యం ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం 4వ శతాబ్ధానికి ముందే ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో స్వామి పడమటి ముఖంగా దర్శనమిస్తాడు. అంతే కాక ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ప్రతి ఆలయంలో ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఆలయంలో ఒక రాతి పీఠంపై కూర్మనాధస్వామి దర్శనమిస్తారు. నిత్యం స్వామి వారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పూతతో కనిపిస్తుంది.

ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లడం వైష్ణవ సంప్రదాయానికి భిన్నమైనా ఇక్కడ మాత్రం నేరుగా గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తారు. అదేవిధంగా, ఈ దేవాలయంలో ఉన్న 108 రాతి స్థంభాలు ఒక్కదానికొకటి పోలిక లేకుండా ఉంటాయి. కాగా, ద్వాపర యుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మం దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన బైరవుడు ఆయనను లోనికి అనుమతించడు. దీంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు. అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కినట్లు చెబుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: