శివం : శివుడిని విగ్రహ రూపంలో పూజించే ఆలయం ఎక్కడుందో తెలుసా...?
శివుడు త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. సింధు నాగరికత కాలం నుంచే శివుడు లింగ రూపంలోను, పశుపతిగాను పూజలందుకున్నాడు. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు శివుడు. శివుడిని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. జననమరణాలకు అతీతుడు శివుడు. కాలమునకు వశము కని కాలాతీతుడు శివుడు. అందుకే ఆయనను సదాశివుడు అంటారు. సాధారణంగా శివుడిని లింగ రూపంలో పూజిస్తారనే సంగతి అందరికీ తెలిసిందే.
దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో శివుడిని లింగ రూపంలోనే పూజిస్తారు. శివుని భక్తులు ఎన్ని ఎన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నా వాటితో పాటు చిత్తూరులోని సురుటుపల్లి దేవాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో శివుడిని విగ్రహ రూపంలో కొలుస్తారు. ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒడిలో పవళించి ఉన్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ దేవాలయం తిరుపతికి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సురుటుపల్లి శ్లీ పళ్లి కొండేశ్వరస్వామిగా ఇక్కడి శివుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఆలయంలో 14 అడుగుల పొడవున మనిషి రూపంలో ఉన్న శివుడు దేవేరి పార్వతీదేవి ఒడిలో పవళించి సేదతీరుతున్నట్లుగా దర్శనమిస్తాడు. ఈ క్షేత్రంలో మాత్రమే శివుడు శయనమూర్తిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఉద్భవించిన విషాన్ని శివుడు లోక కళ్యాణం కోసం స్వీకరిస్తాడు.
కైలాసానికి పయనించే సమయంలో శివుడు పళ్లి కొండేశ్వర క్షేత్రం దగ్గర విష ప్రభావానికి లోనవుతాడు. ఆ సమయంలో స్పృహ తప్పిన శివుడు పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. పార్వతీదేవి శివయ్య కంఠాన్ని గట్టిగా పట్టుకుని విషాన్ని అమృతంగా మారుస్తుంది. ఈ అద్భుత సంఘటనలకు విగ్రహ రూపమే ఈ సురుటుపల్లి దేవాలయం. ఈ ఆలయంలో వెలిసిన దేవతలలో మొదటగా అమ్మవారిని దర్శించుకోవాలని... తరువాత స్వామివారిని దర్శించుకోవాలని పండితులు చెబుతారు.