హెరాల్డ్ సెటైర్ : చివరకు ఆనందయ్యకు పిచ్చెకించేస్తారా ?

Vijaya
క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అదే అనుమానలు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ సోకితే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక, లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేసే స్తోమత లేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. జనాలకు పట్టిన పీడను  చూసి తట్టుకోలేక తనకు తెలిసిన రీతిలో ఆయుర్వేదమో లేక నాటుమందో అదీకాకపోతన సిద్ధవైద్యమో. ఏదో ఒకటి ఇచ్చి జనాల్లో ఆత్మస్ధైర్యాన్ని పెంచాలని, రోగాన్ని నయం చేయాలనే ఉద్దేశ్యంతో పాపం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి చుక్కల మందును రెడీచేశారు. ఆ వైద్యానికి జనాధరణ పెరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ఎవరో పోస్టుచేశారు. దాంతో జనాలు వేలంవెర్రిగా చుక్కుల మందుకోసం ఎగబడ్డారు. ఇంకేముంది వెంటనే లోకాయుక్త ఆదేశాల పేరుతో కలెక్టర్ వ్యవహారంలో  దూరేశారు. అప్పటికప్పుడు చెప్పి చుక్కల మందును నిలిపేశారు.



ఇక అప్పటి నుండి ఆనందయ్య పరిస్దితి ఒకవైపు గోడదెబ్బ మరోవైపు చెంపదెబ్బ అన్నట్లుగా తయారైపోయింది. ఆనందయ్య ఇచ్చే మందుకు శాస్త్రీయంగా అనుమతి లేదని అల్లోపతి వైద్యులు గోల మొదలుపెట్టేశారు. ఇదే సమయంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ శాస్త్రీయత ఏమిటో మాత్రం ఎవరు అడగటం లేదు..చెప్పటంలేదు. ఎందుకంటే అత్యవసరం అనేపేరుతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేయకుండానే టీకాలను ప్రభుత్వం అనుమతించేసింది. టీకాలు వేసుకున్న వాళ్ళకు కూడా కరోనా వైరస్ సోకుతోంది. మళ్ళీ ఈ విషయంపై టీకా తయారీ ఫార్మాకంపెనీలను ఎవరు ప్రశ్నించకూడదు. ఆనందయ్య మందుకు మాత్రమే శాస్త్రీయతను అడుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే జనాలు నమ్మకంతో మందు తీసుకుంటున్నారు. ఆనందయ్య కూడా ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు.



ఎప్పుడైతే ప్రభుత్వం మందు పంపిణీని నిలిపేసిందో వెంటనే రాజకీయాలు దూరేశాయి. అధికారపార్టీ ఒకవైపు ప్రతిపక్షాలు మరోవైపు. చివరకు ఆనందయ్య ముందులో వాడుతున్న దినుసులేవీ హానికరం కాదని ఆయుష్ నిపుణులు తేల్చేశారు. అయినా సరే మందు పంఫిణీకి అనేక అడ్డంకులు. ఒకవైపు ఆయుష్ నిపుణుల అధ్యయనం. ఇంకోవైపు కేంద్ర సంస్ధల పరిశీలన. మరోవైపు టీటీడీ ఆయుర్వేద కాలేజీ ప్రొఫెసర్ల మదింపు జరుగుతోంది. ఇంకోవైపు కోర్టులో కేసు నడుస్తోంది. నిజానికి ఇదంతా ఆనందయ్యకు అవసరమా ? ఏదో కరోనా వైరస్ కు ఉచితంగా మందు ఇద్దామనుకున్న పాపానికి అందరు కలిసి ఆయనకు పిచ్చెక్కించేస్తున్నారు. అధ్యయనాలు ఎప్పుడు తేలుతాయో ? కోర్టులో కేసులు ఎప్పుడు తెములుతాయో ? కేంద్రం ఎప్పుడు అనుమతిస్తుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: