హెరాల్డ్ సెటైర్ : మాస్కు ధరించని జనాలకు జగనే ఆదర్శమా ?

Vijaya

కరోనా వైరస్ నియంత్రణలో అవలంభించాల్సిన జాగ్రత్తల్లో  మొట్టమొదటిది మాస్కు ధరించటం. ఒకళ్ళే ఉన్నపుడు మాస్కు ధరించాల్సిన అవసరం లేదుకానీ పక్కన ఇంకోరున్నా లేదా నలుగురిలో ఉన్నా మాస్కు ధరించటం అన్నది మస్ట్. కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవేమీ పట్టినట్లు లేదు. పైగా తానే అందరికీ కరోనా వైరస్ జాగ్రత్తల గురించి రోజూ పాఠాలు చెబుతున్నారు. ఇంతమందికి పాఠాలు చెబుతున్న జగన్ మాత్రం మాస్కు ధరించటంలేదు. మాస్కే ధరించని వ్యక్తి ఇక శానిటైజర్లు ఉపయోగిస్తారనే గ్యారెంటీ లేదు. జగన్ని చూసిన తర్వాత చాలామంది మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు కూడా మాస్కు ధరించాలనే నియమాన్ని గాలికొదిలేశారు. వివిధ శాఖాధిపతులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు కావచ్చు, మంత్రివర్గ సమావేశాలు కావచ్చు, లేదా కరోనా వైరస్ తీవ్రత నియంత్రణ నేపధ్యంలో ఎవరైనా విరాళాలు ఇవ్వాలని తనను కలుస్తున్న సందర్భాల్లో కూడా కావచ్చు.



ఎక్కడైనా ఒకే పద్దతి జగన్ మాస్కు ధరించటం అన్నది చాలా చాలా అరుదనే చెప్పాలి. ప్రజలందరికీ జాగ్రత్తలు చెప్పే ముఖ్యమంత్రే మాస్కు ధరించాలనే ప్రాధమిక నియమాన్నే ఉల్లంఘిస్తే ఇక మామూలు జనాలకు మాస్కు ధరించమని ఏమి చెబుతారు ? ఎవరు చెప్పాలి ? మొదటిసారి కోవిడ్ టీకా తీసుకునేటపుడు సతీమణి భారతితో కలిసి గుంటూరుకు వెళ్ళారు. ఆ సమయంలో మాత్రం మాస్కు ధరించారు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ జగన్ మాస్కు ధరించటం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. అందుకనే టీడీపీ నేతలు, బీజేపీ నేతలు జగన్ పై పదే పదే ఆరోపణలు, విమర్శలు ఎక్కు పెడుతున్నారు.



నిజానికి మొన్నటి తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సందర్భంలో చంద్రబాబునాయుడు, లోకేష్ తో పాటు చాలామంది ప్రతిపక్షాల నేతలు మాస్కును ధరించలేదన్నది వాస్తవం. అయితే వాళ్ళని జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ జగన్ సగతి అలాకాదు. ముఖ్యమంత్రి కాబట్టి జనాలందరికీ  మార్గదర్శకంగా నిలబడాలి. మార్గదర్శకంగా నిలబడాల్సిన వ్యక్తి ముందు తాను కచ్చితంగా పాటించాలి. లేకపోతే జగన్నే జనాలు ఆదర్శంగా తీసుకునే ప్రమాధముంది. థాయిల్యాండ్ ప్రధానమంత్రికి మాస్కు ధరించలేదని అక్కడి ఉన్నతాధికారులు భారీ ఎత్తున జరిమానా విధించిన విషయం తెలిసిందే. మన దగ్గర అంత సీన్ లేకపోయినా మాస్కు ధరిస్తేనే జనాలందరికీ ఆదర్శంగా ఉంటారు. లేకపోతే మాస్కు ఎందుకు ధరించటం లేదనే విషయంలో జగన్ ఆదర్శంగా నిలిచిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: