హెరాల్డ్ సెటైర్ : బీజేపీకి అప్పుడే ఒక సాకు దొరికేసిందా ?

Vijaya
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో  అధికార వైసీపీదే గెలుపనే విషయం దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే మెజారిటి ఎంత వస్తుందనేదే అర్ధం కావటంలేదు. 5 లక్షలకు తగ్గకుండా మెజారిటి రావాలనే టార్గెట్ తో వైసీపీ నేతలు పనిచేస్తున్నారు. టీడీపీ నేతలేమో గెలుపు తమదే అని చెబుతున్నారు కానీ వాళ్ళకీ తెలుసు అది సాధ్యంకాదని. తాము చెప్పే మాటలను జనాలు నమ్మటం లేదని తెలిసీ పదే పదే కతలు చెప్పటమే కదా టీడీపీ నేతలకు తెలిసింది. పోయినసారి తెచ్చుకున్న 4.98 లక్షలు తెచ్చుకుంటే అదే గెలిచినంత. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహారమే ఇలాగుంటే ఇక బీజేపీ క్యాండిడేట్ రత్నప్రభ గురించి చెప్పేదేముంది ? మొన్నటి ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయింది పాపం.



ఇలాంటి నేపధ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే అదే గెలిచినంతన్న విషయం తెలిసిపోతోంది. కాకపోతే గెలుపు తమదేఅని, గెలవబోయేది బీజేపీ అభ్యర్ధే అని ఉత్త సొల్లు చెబుతున్నారు కమలనాదులు. ఇలాంటి సమయంలోనే కేంద్రప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నెత్తిన పాలుపోసిందనే చెప్పాలి. ఎలాగంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఖాయమైన దగ్గర నుండి ప్రత్యేకహోదా అంశంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇదే తిరుపతి బహిరంగసభలో 2014లో ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని నరేంద్రమోడి ప్రకటించారు. తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని తుంగలోతొక్కారు. అందుకనే ఇపుడు తిరుపతి ఎన్నికలో అదే అంశంపై చర్చ జరుగుతోంది. దాంతో జనాలకు ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక కమలనాదులు తలలు పట్టుకుంటున్నారు.



తమపార్టీ నేతలను రక్షించుకునేందుకా అన్నట్లుగా పాండిచ్చేరికి ప్రత్యేకహోదా ప్రకటించింది కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్. ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెప్పిన ఇదే కేంద్రం మరి పొరుగునే ఉన్న పాండిచ్చేరికి ప్రత్యేకహోదా హామీ ఇచ్చిందనే విషయంపై జనాలు మండిపోతున్నారు. ఎలాగూ ఉపఎన్నికలో పార్టీ గెలవబోయేదేమీలేదు. కాబట్టి ఏపికి ఇవ్వకుండా పాండిచ్చేరికి ప్రత్యేకహోదా హామీ ఇవ్వటం వల్లే జనాలు బీజేపీకి ఓట్లు వేయలేదనే సాకు చక్కగా దొరికేసింది. నిజానికి ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీ పరిస్దితిలో అయితే మార్పుండదన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పటి పరిస్ధితుల్లో  ఓటమికి సాకుగా చెప్పుకునేందుకు పోలింగ్ కు ముందే బీజేపీకి సాకు మాత్రం దొరికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: