హెరాల్డ్ సెటైర్ : చినబాబులో అజ్ఞానమే కాదు భయం కూడా బయటపడింది

Vijaya
తనను తాను చాలా గొప్పోణ్ణని అనుకోవటంలో తప్పేమీలేదు. కాకపోతే ఎదుటివాళ్ళు ఎందుకు పనికిరారు అని అనుకోవటంతోనే సమస్యలు మొదలవుతాయి. మొన్నటి ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత చంద్రబాబునాయుడు, నారాలోకేష్ లో ఈ ఆలోచనలు బాగా పెరిగిపోయినట్లే అనుమానంగా ఉంది. సరే తన ఆలోచనలకు వ్యక్తిగతంగా చంద్రబాబే కాకుండా ఇపుడు పార్టీ కూడా మూల్యం చెల్లించుకుంటోంది. అయితే ఇదే ధోరణిలో చినబాబు లోకేష్ కూడా పయనిస్తుండటమే ఆందోళనగా ఉంది. తాజాగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి లోకేష్ ఓ ట్వీట్ చేశారు. అదేమిటంటే ‘మోడి మెడవంచి తెస్తానన్న ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టిన ఫేక్ సీఎంగారు! ఇపుడు బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామంటోంది. ఏపీకి ముగిసిన అధ్యాయమైన ప్రత్యేకహోదా పుదుచ్చేరిలో ఎలా మొదలవుతుంది’ అని ప్రశ్నించారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రత్యేకహోదా ఇవ్వాల్సింది కేంద్రప్రభుత్వం అంటే నరేంద్రమోడి. అడగాల్సింది నరేంద్రమోడినే. కానీ చినబాబు అడిగింది మాత్రం జగన్మోహన్ రెడ్డిని. ప్రత్యేకహోదా ఏపికి ఇవ్వాల్సిందే అంటు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అడుగుతునే ఉన్నారు. హోదా ముగిసిన అధ్యాయమంటు చెప్పిన కేంద్రం తాజాగా హోదా ఇచ్చేది లేదని తెగేసిచెప్పేసింది. అంటే నరేంద్రమోడి ఇవ్వదలచుకోలేదు కాబట్టే ఏపికి ప్రత్యేకహోదా రావటంలేదన్నది చాలా స్పష్టం. తమ హయాంలో ప్రత్యేకహోదాను తేవటంలో చంద్రబాబు ఫెయిల్ అవ్వటానికి, ఇపుడు జగన్ తేలేకపోవటానికి చాలా తేడాఉంది.



చాలాకాలం చంద్రబాబు+బీజేపీ మిత్రపక్షాలు. కేంద్రంలో టీడీపీ మంత్రులు, రాష్ట్రంలో బీజేపీ మంత్రులున్నారు. కాబట్టి నాలుగేళ్ళు కలిసున్న తర్వాత కూడా ప్రత్యేకహోదా తేలేదంటే చంద్రబాబు ఫెయిలైనట్లే. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు, బీజేపీ విడిపోయారు. తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది టీడీపీ. అప్పటినుండి మళ్ళీ మోడికి దగ్గరవ్వాలన్న ఆలోచనతోనే చంద్రబాబు కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడేందుకు ధైర్యం చేయటంలేదు. ఒకవేళ జగన్ కూడా ఫెయిలైనట్లే అనుకున్నా పుదిచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తున్నందుకు లోకేష్ నిలదీయాల్సింది మోడినే కానీ జగన్ను కాదు. అలాంటిది మోడిని కాకుండా జగనే టార్గెట్ చేస్తున్నారంటే అర్ధమేంటి . ఏమిటంటే  లోకేష్ లో అజ్ఞానంతో పాటు మోడి అంటే భయం కూడా పేరుకుపోయిందని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: