తమిళనాడు ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. రికార్డు స్ధాయిలో ఐదుకూటములు ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. సరే అన్నీ కూటముల్లోకి అధికార అన్నాడీఎంకే, ప్రధానప్రతిపక్షమైన డీఎంకే కూటమి మధ్యే అధికారం కోసం ప్రధాన పోటీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపేమో ఇప్పటివరకు వెల్లడైనా ప్రీపోల్ సర్వేలన్నీ డీఎంకేకే అధికారమని తేల్చి చెప్పేస్తున్నాయి. పదేళ్ళుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మీద జనాల్లో వ్యతిరేకత పెరగటం చాలా సహజం. కానీ ప్రీపోల్లో వెల్లడవుతున్న జనాభిప్రాయంలో విచిత్రమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. విషయం ఏమిటంటే పళనిస్వామి ప్రభుత్వంపై జనాల్లో పెద్దగా వ్యతిరేకత ఎక్కడా కనబడటం లేదని అర్ధమవుతోంది. జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రయిన ఎడ్డపాడి పళనిస్వామి ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడపటమే చాలా ఎక్కువగా జనాలు అభిప్రాయపడ్డారట.
మరి పళనిస్వామి ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోతే జనాలు డీఎంకేకు ఎందుకు ఓట్లేస్తామని అంటున్నారు ? ఎందుకంటే అసలు సమస్యంతా ఇక్కడే ఉందట. ప్రభుత్వాన్ని నడపటంలో పళనిస్వామి ప్రతివిషయంలోను బీజేపీపై ఆధారపడ్డారని మెజారిటి జనాలు అభిప్రాయపడుతున్నారట. జయ మరణం తర్వాత కేంద్రప్రభుత్వం తమిళనాడు రాజకీయాల్లోను, ప్రభుత్వంలోను విపరీతంగా జోక్యం చేసుకుంటోందన్నది వాస్తవం. రాజకీయపార్టీగా రాష్ట్రంలో ఎదగాలని అనుకోవటంలో తప్పులేదు. అయితే దశాబ్దాల పాటు డీఎంకే అయినా అన్నాడీఎంకే అయినా బీజేపీని కాలికింద తొక్కిపెట్టేశాయి. దాంతో కమలంపార్టీ ఉనికే లేకుండాపోయింది రాష్ట్రంలో. నిజానికి జనాలు కూడా ఉత్తరాధిపార్టీ అనే బీజేపీని దూరంగా పెట్టేశారు. అలాంటిది తమిళనాడు రాజకీయాల్లో పెరిగిపోయిన బీజేపీ పాత్రను, ప్రభుత్వంలో జోక్యాన్ని జనాలు సహించలేకపోతున్నారట.
ఈ నేపధ్యంలోనే బీజేపీ చేతిలో బంధీగా చిక్కుకున్న పళనిస్వామి అంటే జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. పళని చేతకాని తనంవల్లే ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిపోయిందనే మంటతోనే డీఎంకేకు ఓట్లేస్తామని జనాలు చెబుతున్నారట. బీజేపీ విషయంలో జనాభిప్రాయం విచిత్రంగా లేదు. క్షేత్రస్ధాయిలో జనాభిప్రాయం చూస్తుంటే అన్నాడీఎంకే గెలుపు అవకాశాలను బీజేపీయే దెబ్బకొట్టేట్లుంది చూస్తుంటే. మరి జనాల మూడ్ తెలిసిన తర్వాత కూడా పళనిస్వామి బీజేపీని ఎందుకు దూరంగా పెట్టలేదో అర్ధం కావటంలేదు. ఫలితాలు వెల్లడైన తర్వాత కానీ విషయం స్పష్టంగా తెలీదు.