హెరాల్డ్ సెటైర్ : ప్రత్యేక ప్యాకేజీ అంటే ఏమిటో ఎవరికైనా తెలుసా ?

Vijaya
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపి డెవలప్మెంట్ కు అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన కీలక హామీల్లో ప్రత్యేకహోదా ఒకటి. దానిపై 2014 ఎన్నికల్లో బీజేపీ+నరేంద్రమోడి, వెంకయ్యానాయుడు పదే పదే ప్రస్తావించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారంలోకి రాగానే అన్నింటినీ మరచిపోయి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. పైగా ప్రత్యేకహోదా ఇస్తామని తానెప్పుడూ చెప్పలేదని ప్రధానమంత్రి నరేంద్రమోడి తరపున కొందరు జనాలను దారుణంగా మోసంచేశారు. బీజేపీ రాష్ట్ర నేతలు కూడా సిగ్గులేకుండా కేంద్రం వాదనకే మద్దతుగా నిలబడ్డారు. హోదాను సాధించేసినట్లుగా వెంకయ్యనాయుడు అయితే ఏకంగా పౌరసన్మానమే చేయించేసుకున్నారు.



సీన్ కట్ చేస్తే హోదా లేదు గీదా లేదు పొమ్మంది కేంద్రం. ప్రత్యేకహోదా స్ధానంలో ప్రత్యేకప్యాకేజీని ప్రకటించింది. అర్ధరాత్రిపూట ప్యాకేజీని ప్రకటించిన అప్పటి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభాలుంటాయని బొంకారు. ప్యాకేజినే అమలు చేస్తామని చెప్పిన కేంద్రం చాలాకాలం ఈ విషయంపైన కూడా ఏమీ మాట్లాడలేదు. చివరకు ప్యాకేజీని అమలు చేస్తున్నట్లు చెప్పిందే కానీ ఏ ఏ రూపాల్లో అమలు చేస్తోందో చెప్పలేదు. ప్యాకేజీని ప్రకటించిన జైట్లీ అనారోగ్యంతో మరణించటంతో ప్యాకేజీపైన కూడా కేంద్రం అడ్డదిడ్డమైన వాదనలు వినిపించింది. దాంతో అసలు ప్యాకేజీ ఏమిటో ? దానివల్ల వచ్చే లాభాలేమిటో కూడా జనాలకు అర్ధంకాలేదు. చివరకు జనాలు మొత్తాన్ని వదిలిపెట్టేశారు. చివరకు ప్రత్యేకహోదా అనేది రాజకీయపార్టీల మధ్య వివాదాలకు మాత్రమే పరిమితమైపోయింది.



మళ్ళీ ఇంత కాలానికి పార్లమెంటులో ప్రత్యేకహోదా అంశం ప్రస్తావనకు వచ్చింది. తాజాగా కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రత్యేకహోదా అంశం ముగిసిన అధ్యాయమైపోయింది. ఇదే సమయంలో హోదా స్ధానంలో ప్రత్యేకప్యాకేజీతో పాటు ఇతర ప్రయోజనాలను అమలు చేస్తున్నట్లు చెప్పింది. అసలు ప్రత్యేకప్యాకేజీలో రాష్ట్రానికి ఏమిచ్చింది ? ఇతర ప్రయోజాలంటే ఏముంటాయి ? అన్నది ఓ బ్రహ్మపదార్ధం లాగ మిగిలిపోయింది. రాష్ట్రానికి ఎన్డీయే వచ్చిన తర్వాత ఐఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ లాంటి వాటిని చెబుతున్నారు. కానీ అవన్నీ విభజన హామీల్లో భాగంగా నాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చినవే. కొత్తగా ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదనే చెప్పాలి. మొత్తానికి కొత్తగా ఏమీ ఇవ్వకపోయినా ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కేస్తున్న మోడి సర్కార్ నిజంగా గొప్పదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: