హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వం Vs నిమ్మగడ్డ..సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులుండవేమో ?

Vijaya
ఏ ముహూర్తాన స్ధానిక సంస్ధల ఎన్నికలు మొదలయ్యాయో అప్పటి నుండి ప్రతిరోజు ట్విస్టుల మీద ట్విస్టులు. సస్పెన్స్ సినిమాల్లో కూడా జనాలు ఇన్ని ట్విస్టులు చూసుండరేమో. పొద్దున లేచింది మొదలు రాత్రి గడచేంతవరకు నిమ్మగడ్డ విషయంలో ప్రభుత్వం ఎల వ్యవహరిస్తుందన్నది పెద్ద సస్పెన్స్. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో అర్ధంకానంత ట్విస్టు. తాజాగా పంచాయితి ఎన్నికల్లో మొదటి విడతలో సుమారు 532 పంచాయితీలు ఏకగ్రీవాలయ్యాయి. ఇందులో చిత్తూరు జిల్లాలో 112 పంచాయితీలు, గుంటూరు జిల్లాలో 67 పంచాయితీలు ఏకగ్రీవాలయ్యాయి. అయితే ఏకగ్రీవాలపై ఆ ఫలితాలను పక్కన పెట్టేయమని నిమ్మగడ్డ ఆదేశించటం ఇపుడు వివాదాస్పదమవుతోంది.



ఒకసారి ఎన్నికలు జరిగి ఏకగ్రీవాలైపోయిన తర్వాత వాటిని నిలిపేయటం లేదా రద్దు చేయటం దాదాపుగా జరగదు. ప్రత్యర్ధులు ఫిర్యాదు చేస్తే అదివేరే సంగతి. కానీ ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఏకగ్రీవాలపై అనుమానంతో వాటిని ప్రకటించకుండా నిలిపేయటం అరుదే. కానీ ఇపుడు నిమ్మగడ్డ ఆపేశారు. ఎందుకంటే కమీషనర్ మొదటినుండి ఏకగ్రీవాలకు పూర్తి వ్యతిరేకంగానే ఉన్నారు. తాను ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదని చెబుతునే ఏకగ్రీవాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అందుకనే నిమ్మగడ్డ వైఖరిపై మంత్రులు మండిపోతున్నారు. మరి రేపు వీటి విషయంలో నిమ్మగడ్డ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలీదు. ఒకవేళ అన్నింటినీ రద్దు చేస్తే అప్పుడుంటుంది మజా.



‘ఈ వాచ్’ యాప్ నే తీసుకోండి. ఎన్నికల కోసం ప్రత్యేకంగా రిలయన్స్ సంస్ధ సాయంతో యాప్ తీసుకొచ్చినట్లు చెప్పారు నిమ్మగడ్డ. ఈ యాప్ వద్దని ప్రభుత్వం అంటే కాదు వాడాల్సిందే అని నిమ్మగడ్డ అన్నారు. సరే ఇపుడు ఆ యాప్ వినియోగాన్ని 9వ తేదీవరకు పక్కన పెట్టేయమని కోర్టు చెప్పింది లేండి. నిజానికి ఆ యాప్ సాంకేతిక కారణాలతో పనిచేయటం లేదు. విషయం ఏదైనా కానీండి ఒకళ్ళు ఎడ్డమంటే మరొకళ్ళు వెంటనే తెడ్డమంటున్నారు. ప్రభుత్వం-నిమ్మగడ్డ గొడవల్లో మధ్యలో నలిగిపోతున్నది అధికార యంత్రాంగమే. ఏకగ్రీవమైన పంచాయితీలను వెంటనే ప్రకటించమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేస్తుంటే ప్రకటిస్తే యాక్షన్ తీసుకుంటానని కమీషనర్ బెదిరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిరోజు ఏదో ఓ వివాదంతో గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈ రోజుకు ఏకగ్రీవాలైపోయాయి. మరి శనివారం ఏమవుతుందో చూడాల్సిందే. ఎందుకంటే నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కమిటి సమావేశం కత్తి వేలాడుతునే ఉంది కాబట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: